ఊపిరి ఆపేస్తున్నారు..!

Oxygen Supplu Stops to 108 Ambulances in Srikakulam - Sakshi

108 వాహనాలకు నిలిచిన ఆక్సిజన్‌ సరఫరా

బకాయిలు పెరగడంతో ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరాను నిలిపివేసిన వైనం  

పదిరోజులైనా పట్టించుకోని ప్రభుత్వం అవస్థల్లో రోగులు  

ప్రమాదంలో ఉన్న వారికి తక్షణం సేవలు అందించి వారిని ఆస్పత్రికి చేర్చే అపర సంజీవనిగా పేరుగాంచిన 108 వాహనాలు ప్రాణాపాయంలో పడ్డాయి. ఒకనాడు అన్ని వసతులు, మందులు, ఆక్సిజన్, ఇతర టెక్నాలజీతో క్షణాల్లో రోగులను, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన ఈ వాహనాలు ప్రస్తుతం నిరాదరణకు గురవుతున్నాయి. గడిచిన నాలుగేళ్లుగా వీటిని టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాడైన వాటికి మరమ్మతులు చేపట్టకపోవడం, నిర్వహణ ఖర్చులు సకాలంలో చెల్లించక కుర్రో, మొర్రో మంటున్నాయి. ఇంతలోనే మరో ప్రమాదంలో పడ్డాయి. అత్యవసరమైన ఆక్సిజన్‌ సరఫరా గత పది రోజులుగా నిలిచిపోయింది. వీటిని సరఫరా చేసే సంస్థకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

శ్రీకాకుళం అర్బన్‌/కాశీబుగ్గ: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన 108 వాహనాలు నేడు ప్రజా సేవకు దూరమవుతున్నాయి. వీటి ఆలన పాలన చూసే నాథుడే లేకుండా పోయాడు. చంద్రబాబు సర్కార్‌ వీటిని పూర్తిగా పట్టించుకోవడమే మానేసిందని చెప్పాలి. గత పది రోజులుగా వాహనాలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయినా పట్టించుకోలేదంటే సర్కార్‌ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర సమయంలో 108 వాహనం వస్తే ఎంత బాధలో ఉన్నవారికైనా ప్రమాదం తప్పిందనే భరోసా రోజురోజుకూ లేకుండా పోయింది. ప్రమాదంలో ఉన్నవారికి ఆక్సిజన్‌ ఎంతో అవసరం. అత్యవసరంలో ఉన్నవారికి ఇది అందుబాటులో లేకుంటే వారి పరిస్థితి ఊహించలేం. కానీ పది రోజులుగా జిల్లాలోని 108 వాహనాల్లో ఆక్సిజన్‌ నిండుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆక్సిజన్‌ సిలిండర్లు లేకుండానే వాహనాలను నడిపేస్తున్నారు. ముఖ్యమంత్రిగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 108 వాహనాలు ప్రజలకువిశేష సేవలు అందించాయి. ఎవరైనా ఆపదలో ఉన్నట్టు సమాచారం వచ్చిన కొన్ని నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రాణదానం చేసేవి. అలాంటి వాహనాలు నేడు నిరాదరణకు గురవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వీటి సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పది రోజులుగా 108 వాహనాలకు ఆక్సిజన్‌ సరఫరా చేసే ఏజెన్సీ సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదాలకు గురైన వారు, ఇతర అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ విషయం బయటకు రానీయకుండా సంబంధిత శాఖ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. సమాచారం ఎవరికీ చెప్పవద్దని హుకం సైతం జారీ చేసినట్టు తెలిసింది. 

జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల, కొత్తూరు (ఐటీడీఏ), లావేరు, పాలకొండ(ఐటీడీఏ), పొందూరు, రాజాం, రణస్థలం, రేగిడి, సంతకవిటి, సీతంపేట(ఐటీడీఏ), శ్రీకాకుళం–02, వీరఘట్టం, కవిటి, సొంపేట, మందస, పలాస, నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నరసన్నపేట, గార, జలుమూరు, పాతపట్నం, హిరమండలం, ఇచ్ఛాపురంలో మొత్తం 28 వాహనాలు ఉన్నాయి. వీటిలో పాత వాహనాలు ఎనిమిది ఉన్నాయి. అలాగే ఏడాదిన్నర క్రితం వచ్చినవి 16 వాహనాలు వచ్చాయి. మూడు నెలల క్రితం 4 కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి పరిధిలో 133 మంది సిబ్బంది రెండు షిఫ్ట్‌లలో విధులను నిర్వహిస్తున్నారు. 

బకాయిలు చెల్లించకపోవడమే కారణం  
108 వాహనాలకు ఆక్సిజన్‌ సరఫరా చేసే ఏకైక ఏజెన్సీ శ్రీకాకుళంలోని సత్యసాయి గ్యాస్‌ ఏజెన్సీ. ఈ సంస్థ 2017 డిసెంబరు 13వ తేదీ నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 108 వాహన నిర్వహణ సంస్థ అయిన భారత్‌ వికాస్‌ గ్రూప్‌ గ్యాస్‌ ఏజెన్సీకి రూ.40 వేలు నగదు బకాయి పడింది. దీంతో 108 వాహనాలకు గత పది రోజులుగా గ్యాస్‌ ఏజెన్సీ వారు ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరాను నిలిపివేశారు. సాధారణంగా వాహనానికి ఒకటి, రెండు ట్యాంకర్‌లు ఉంటాయి. వాడుకను బట్టి ఆక్సిజన్‌ సిలిండర్‌ 30 నుంచి 45 రోజులు వస్తుంది. ప్రస్తుతం ఆక్సిజన్‌ లేకుండానే 108 వాహనాలను నడుపుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు.

కొద్ది రోజులుగా సరఫరా నిలిచింది
108 వాహనాలకు ఆక్సిజన్‌ సరఫరా కొద్దిరోజులుగా నిలిచిపోయింది. సిలిండర్‌ సరఫరా చేసే ఏజెన్సీ అధికారులు అందుబాటులో లేరు. అలాగే ఆక్సిజన్‌ సరఫరా చేసే ఏజెన్సీకి బకాయిలు ఉన్నమాట వాస్తవమే. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే వారికి చెల్లిస్తాం. అవసరమైన వాహనాలకు ఆక్సిజన్‌ కావాలని సరఫరా సంస్థను కోరుతున్నాం.    – అఖిల్, 108 జిల్లా మేనేజర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top