
మళ్లీ బాక్సైట్ సెగ
బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు మన్యంలో ఊపందుకుంటున్నాయి.
ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధం కావాలని దళసభ్యుల పిలుపు
సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు మావోయిస్టు లేఖలు
మారుమూల గూడేల్లో ఉద్రిక్త పరిస్థితులు
మండల కేంద్రాల్లో సీపీఎం రాస్తారోకో
బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు మన్యంలో ఊపందుకుంటున్నాయి. పాడేరు, అరకు ఎమ్మెల్యేలతోపాటు వామపక్షాలు దీనికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఖనిజ తవ్వకాల మాటతో రగిలిపోతున్న గిరిజనులను తమకు అనుకూలంగా మలచుకోడానికి మావోయిస్టులు పావులు కదుపుతున్నారు. పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలంటూ మన్యంలోని ప్రజాప్రతినిధులకు తాజాగా లేఖలు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం పెదబయలు, అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సర్పంచ్‌లు సమావేశమై ఖనిజ తవ్వకాలను వ్యతిరేకించాలని తీర్మానించారు. దీంతో ఇంత వరకు ప్రశాంతంగా ఉన్న మన్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
చింతపల్లి: చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లోని జర్రె ల, సప్పర్ల, కోరుకొండ ప్రాంతాలలో నిక్షిప్తమైవున్న బాక్సైట్ ఖనిజాన్ని వెలికితీసేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విదేశీ కంపెనీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మన్యంలో బాక్సైట్ తవ్వకాలతో వేలాది మంది నిరాశ్రయులవుతారు. ప్రధాన వాణిజ్యపంటైన కాఫీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోనే దీనిని వైఎస్సార్‌సీపీతోపాటు ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకించారు. ఆందోళనలు చేపట్టారు. నిజానికి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పు డే బాక్సైట్ తవ్వకాల అంశానికి బీజం పడింది. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో తవ్వకాలకు ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో మాజీ మంత్రి మణికుమారి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు జీకేవీధిభారీ బహిరంగ సభలో తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక మరోసారి బాక్సైట్ తవ్వకాల అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తవ్వకాలను అడ్డుకునేందుకు తమపార్టీ నేతలు, కార్యకర్తలను ఇప్పటికే సన్నద్ధం చేశారు. సోమవారంనాటి ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలోనూ ఇదే అంశం కీలకమైంది. వైఎస్సార్‌సీపీ నాయకులంతా బాక్సైట్‌కు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మావోయిస్టులు కూడా మరోసారి బాక్సైట్ వ్యతిరేక పోరాటం ఉధృతానికి ప్రణాళికలు రూపొందించారు. చింతపల్లి, జీకేవీధి మండలంలోని అన్ని పార్టీల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రత్యేక లేఖలు రాశారు. బాక్సైట్ తవ్వకాల జోలికి రామని గతంలో పేర్కొన్న టీడీపీ నేతలు ఇప్పుడు విదేశీ కంపెనీలతో లాలూచీ పడి మన్యం ప్రజలను మోసం చేస్తున్నారని, అన్ని వర్గాల వారు దీనిని వ్యతిరేకించాలని ఆయా లేఖల్లో పేర్కొన్నారు. బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు ఏజెన్సీ ప్రాంత గిరిజనులతోపాటు ఇక్కడ నివసిస్తున్న గిరిజనేతరులు, వ్యాపారులు కూడా సహకరించాలని కోరినట్టు తెలిసింది.
సీపీఎం రాస్తారోకో
అరకులోయ: బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానించాలంటూ నియోజవర్గం పరిధిలోని అరకులోయ, డుంబ్రిగుడ, పెదబయలు, అనంతగిరి మండల కేంద్రాల్లో సోమవారం రాస్తారోకో చేపట్టారు.
సీపీఎం మండల కార్యదర్శి పొద్దు బాలదేవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జంక్షన్ వద్ద అరకులోయలో రాస్తారోకో నిర్వహించారు. బాలదేవ్ మాట్లాడుతూ రెండేళ్ల అనంతరం జరిగిన ఐటీడీఏ పాలక వర్గ సమావేశంలో గిరిజనులకు ముప్పుతెచ్చే బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానిస్తారని అంతా భావించారన్నారు. టీడీపీ నాయకులు, అధికారులు గౌరవ సభ్యుల నోరునొక్కేశారన్నారు. అరకులోయ ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత గిరిజనుల సంక్షేమానికి కృషి చేయకపోగా, కీలకమైన పాలక వర్గ సమావేశాన్ని డుమ్మా కొట్టడం సరికాదన్నారు. చంద్రబాబుతో కుమ్మక్కయి రాకుండా తప్పించుకున్నారన్నారు. ఐటీడీఏ ద్వారా బాక్సైట్ తవ్వకాలు చేపడతామని సీఎం చెబుతుంటే ప్రజాప్రతినిధిగా ఖండించకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు హరి, రామారావు, భగత్‌రామ్, తదితరులు పాల్గొన్నారు.