
జిల్లా అగ్నిమాపక శాఖ ఆన్‌లైన్ సేవల్లోకి అడుగుపెట్టింది. ఇకపై భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, కల్యాణమండపాలు, ఫ్యాక్టరీలు, ఇతర పరిశ్రమల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల(ఎన్‌ఓసీ)కు దరఖాస్తు చేసుకోవడానికి అగ్నిమాపక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎన్‌ఓసీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
తిరుపతి క్రైం: అగ్నిమాపక శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఒక అడుగు ముందుకు వేసింది. ఆన్‌లైన్ ద్వారా నిరభ్యంతర సర్టిఫికెట్(ఎన్‌ఓసీ) అందించే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలోని అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాలోని 16 కార్యాలయాల్లో ఈ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అగ్నిమాపక శాఖ పరిశ్రమలు లేక అందుకు సంబంధించిన ప్రభుత్వ విభాగాల అధికారులు కమిటీగా ఏర్పడి వచ్చి పరిశీలిస్తారు. నిబంధనల మేరకు యజమానులు అన్ని సమకూర్చుకుని ఉంటే ఆన్‌లైన్ ద్వారా ఎన్‌ఓసీ పొందవచ్చు. www. fireservices.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ తర్వాత http://202.83.28 .165/noc/#/login కావాల్సి ఉంది. నూతన దరఖాస్తుదారులతో పాటు ప్రొవిజినల్, ఆక్యుపెన్సీ, రెన్యూవల్ కోసం ఎన్‌ఓసీ పొందాలన్నా కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌లో ఇలా...
♦ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత దరఖాస్తుదారుడు మొదటగా రిజిస్టర్ చేసుకోవాలి.
♦ ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఈ–మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్‌ను పొందుపరచాలి.
♦ పాస్‌వర్డ్ ద్వారా వెబ్‌సైట్‌లోకి లాగిన్‌కావాలి. దరఖాస్తు ఫారంలో సూచించిన విధంగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
♦ దరఖాస్తు ఫారాలు అప్‌లోడ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకూడదు. పొరపాట్లు జరిగితే సిస్టమ్‌లోనే గుర్తు చేసేలా వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి దరఖాస్తు పరిశీలన ఏస్థాయిలో ఉందో అగ్నిమాపక శాఖ వారు మెయిల్, సెల్‌కు మెసేజ్ పంపుతారు.
♦ దరఖాస్తు పరిధిని బట్టి అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలన కోసం ఓ కమిటీని నియమించి, సంబంధిత భవనాలు, నిర్మాణాలను పరిశీలిస్తారు.
♦ అన్నీ సక్రమంగా ఉంటే ఎన్‌ఓసీ మంజూరు చేస్తారు. లేదంటే ఎలాంటి సర్టిఫికెట్లు కావాలి.. సౌకర్యాలు ఏవిధంగా ఉండాలి.. అన్న వివరాలను దరఖాస్తుదారునికి ఆన్‌లైన్‌లో పంపుతారు.
♦ దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలి.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు తదితర వివరాలను ఆన్‌లైన్లో పొందుపరిచారు. సందేహాలు ఉంటే ఆన్‌లైన్‌లో నివృత్తి చేసుకోవచ్చు.
అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ పొందడంలో సందేహాలు ఉంటే ఆన్‌లైన్‌లో నివృత్తి చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో ఉంచిన నంబర్‌ను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇక నుంచి ఎన్‌ఓసీ కోసం అగ్నిమాపక శాఖకు రావాల్సిన అవసరం లేదు. – శ్రీనివాసులురెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి