టీడీపీ నేతల పాపాలు.. డెయిరీకి శా‘పాలు’

Ongole Dairy Was Neglected By TDP Leaders - Sakshi

చంద్రబాబు పాలనలో సహకార రంగం నిర్వీర్యం

ఒంగోలు డెయిరీ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిన టీడీపీ నేతలు 

ఐదేళ్లపాటు పట్టించుకోకుండా చోద్యం చూసిన ప్రభుత్వం 

సాక్షి, ఒంగోలు సబర్బన్‌: సొంత ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించిన జిల్లా టీడీపీ నాయకులు సహకార రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. అభివృద్ధి చేస్తామని చెబితే నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారు. సహకార రంగం కుదేలవుతోందని సీఎం చంద్రబాబుకు తెలిసినా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పీడీసీసీబీ, డీసీఎంస్‌లో టీడీపీ నేతల పెత్తనం కారణంగా అవి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. జిల్లాలో సహకార వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. బాబు ఐదేళ్ల పాలనలో సహకార వ్యవస్థలో ఉన్న ప్రధానమైన సంస్థలన్నీ మూతపడే స్థితికి చేరాయి. సహకార సంఘాలు, సొసైటీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సహకార సంఘాలు బలోపేతమైతే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ అధికార టీడీపీ నాయకులు వారి వ్యాపారాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం సహకార వ్యవస్థను నాశనం చేశారు. 

కోలుకోలేని స్థితిలో ఒంగోలు డెయిరీ.. 
జిల్లాలో ప్రధానంగా సహకార రంగంలో ఉన్న ఒంగోలు డెయిరీని పాలక మండలి చైర్మన్‌గా వ్యవహరించిన టీడీపీ నేత చల్లా శ్రీనివాసరావు మ్యాక్స్‌ చట్టంలోకి మార్చి కంపెనీ యాక్టులోకి తీసుకెళ్లాడు. డెయిరీ సొమ్ము రూ.80 కోట్లు కాజేసి ఒట్టిపోయిన గేదెలా తయారు చేశాడు. దేశంలోనే ప్రకాశం జిల్లా పాలకు మంచి గిరాకీ ఉంది. దానికితోడు రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. రోజూ ఒంగోలు డెయిరీకి 2 లక్షల లీటర్ల పాలు వచ్చేవంటే జిల్లాలో పాడి పరిశ్రమ ఏ విధంగా అభివృద్ది చెందిందో అర్థమవుతుంది. అలాంటి డెయిరీని రూ.80 కోట్లకు పైగా అప్పుల్లోకి కూరుకుపోయేట్టు చేసింది టీడీపీ నాయకులతో కూడిన పాలకమండలి.

సుదీర్ఘ కాలం చైర్మన్‌గా ఉన్న చల్లా శ్రీనివాసరావు తన సొంత నిధుల మాదిరిగా డెయిరీ డబ్బును ఖర్చు చేసి చివరకు మూతపడే స్థితికి తీసుకెళ్లాడు. పాలు పోసిన రైతులకు నేటికీ డబ్బు ఇవ్వలేదు. పాలు రవాణా చేసిన ట్రాన్స్‌పోర్ట్‌దారులకు కిరాయిలు ఎగ్గొట్టారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టలేదు. ఫెడరేషన్‌ నుంచి రూ.35 కోట్లు అప్పు తీసుకుని తిరగి గాడిలో పెడదామన్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఉద్యోగులకు వేతనం ఇవ్వకపోవడంతో డెయిరీ నిర్వహణే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అధికారులతో కూడిన పాలక మండలి కూడా డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆసక్తి చూపడం లేదు. 

రైతులకు ఉపయోగపడని పీడీసీసీబీ
ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(పీడీసీసీబీ) పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగ పడే పరిస్థితిలో లేకుండా పోయింది. ఈ బ్యాంకు పరిధిలో 169 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. అవన్నీ ఉత్సవ విగ్రహాల్లా ఉండిపోయాయి తప్పితే వ్యవసాయ రుణాలు ఇచ్చే పరిస్థితిలో లేవు. అసలే ఐదేళ్లుగా వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్నా కనీసం ఆరుతడి పంటలకు కూడా పంట రుణాలు ఇచ్చే పరిస్థితి పీడీసీసీ బ్యాంకుకు లేదు. ఎందుకంటే ప్రభుత్వం బ్యాంకుకు సంబంధించిన నిధులు బడా బాబులకు అప్పనంగా ఇచ్చి బ్యాంకును నష్టాల్లోకి నెట్టారు.

పీడీసీసీ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల క్రితం స్వయానా ప్రభుత్వమే హామీగా ఉండి ఇంకొల్లు స్పిన్నింగ్‌ మిల్లుకు కోట్లాది రూపాయలు అప్పుగా ఇప్పించింది. తర్వాత కాలంలో చంద్రబాబునాయుడి దెబ్బకు స్పిన్నింగ్‌ మిల్లు మూత పడింది. అయితే ఇచ్చిన అప్పును తిరిగి పీడీసీసీ బ్యాంకుకు ఇప్పించాల్సిన ప్రభుత్వం నేటికీ దాని ఊసే పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బ్యాంకుకు దాదాపు రూ.11 కోట్లు మొండి బకాయి కింద ఉండిపోయింది. 
అదే విధంగా ముఖ్యమంత్రి సామాజికవర్గానికే చెందిన పీడీసీసీ బ్యాంక్‌ పాలక మండలి మాజీ చైర్మన్‌ తన కుటుంబ సభ్యుల పేరుతో, తారకరామ డెయిరీ పేరుతో రూ.4 కోట్లు రుణం తీసుకున్నాడు. అది కాస్తా వడ్డీ పెరిగి రూ.7 కోట్లు అయింది. ఆ బాకీ వసూలు ఊసే లేదు.
బ్యాంకులో నకిలీ ఆభరణాలు పెట్టి రూ.2.50 కోట్లు రుణంగా తీసుకున్నారు. రెండేళ్ల క్రితం ఆ కుంభకోణం కేసులో కొందరిపై చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. 4,500 పేజీల నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఆ కుంభకోణం తాలూకు నిధులు ఇప్పటికీ రికవరీ కాలేదు.
♦ జిల్లాలో 169 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌) నుంచి రైతులు ప్రయోజనం పొందాల్సి ఉంటే వాటి ఊసే లేదు. కానీ వారోత్సవాల పేరిట రోజుకు రెండు పీఏసీఎస్‌లలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. వాటి వల్ల రైతులకు ఒరగింది మాత్రం శూన్యం.

అప్పుల కుప్ప డీసీఎంఎస్‌
జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) పరిస్థితి కూడా అంతే. రైతులకు సంబంధించిన వ్యాపారాలు చేసి తద్వారా వచ్చే లాభాలను రైతు ప్రయోజనాలకు వినియోగించాల్సిన డీసీఎంఎస్‌ అందుకు భిన్నంగా వ్యవహరించింది పాలకమండలి తీరుతో డీసీఎంఎస్‌ అప్పుల ఊబిలోకి వెళ్లిపోయింది. పాలక మండలి సభ్యులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, విలాసవంతమైన జీవితం గడపడం కోసం రూ.13 కోట్లకు పైగా వెచ్చించి సినిమా వ్యాపారం చేశారు. లాభం వచ్చినా కూడా నష్టాలొచ్చాయని చెప్పి చివరకు అప్పు చూపించారు. ఈ నిర్వాకానికి కారణం గతంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ఉన్న చిడిపోతు సుబ్బారావు. ఈయన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుకు సమీప బంధువు. అతని స్వార్థానికి డీసీఎంఎస్‌ నిలువునా బలైపోయింది. ఈ తతంగమంతా జిల్లా సహకార శాఖ అధికారులకు తెలిసినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే అధికారులను కూడా వారి విధులు వారు నిర్వర్తించకుండా టీడీపీ నేతలు పెత్తనం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top