నాగాయలంకలో చమురు బావుల గుర్తింపు | ongc found Oil wells in nagayalanka | Sakshi
Sakshi News home page

నాగాయలంకలో చమురు బావుల గుర్తింపు

Apr 28 2015 8:58 PM | Updated on Sep 3 2017 1:02 AM

కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలో కృష్ణా జిల్లా నాగాయలంకలో చమురు బావులను ఓఎన్జీసీ తాజాగా గుర్తించింది.

రాజమండ్రి(తూ.గో.జిల్లా):  కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలో కృష్ణా జిల్లా నాగాయలంకలో చమురు బావులను ఓఎన్జీసీ తాజాగా గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ రాజమండ్రి అసెట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దేబశీష్ సన్యాల్  మంగళవారం వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి రెండు హై జనరేషన్ బావుల్లో తొలి దశ  డ్రిల్లింగ్ ఆరంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ బావుల ద్వారా రోజుకు 10 వేల బేరళ్ల చమురు, ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికితీయవచ్చని అంచనా వేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫీల్డ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎఫ్‌డీపీ) పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు. అక్కడ నుంచి అనుమతి రాగానే తొలి దశలో రెండు, రెండో దశలో 18 బావులను ప్రారంభిస్తామన్నారు.

 

తొలి దశ బావులను ఎన్‌జెడ్-1ఎస్‌టీ, ఎస్‌ఈ-1 బావులుగా నామకరణం చేశామని సన్యాల్ వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట, మల్లేశ్వరం బావులను విస్తరించనున్నామని వివరించారు. గత ఏడాది జరిగిన నగరం గ్యాస్ పైపులైను పేలుడువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఓఎన్‌జీసీ చర్యలు తీసుకుంటుందన్నారు. గ్యాస్‌తోపాటు నీరు, ఇతర పదార్థాలు వెళ్లడంవల్ల పైప్‌లైన్లు దెబ్బతింటున్నాయని గుర్తించిన తమ సంస్థ, దీని నివారణకు ఐదు ప్రాంతాల్లో గ్యాస్ డీహైడ్రేజేషన్ యూనిట్లు ఏర్పాటు చేయనుందన్నారు. దీనివల్ల ప్యూరిఫైడ్ గ్యాస్ రవాణా జరుగుతుందని, పైపులైన్లు త్వరగా దెబ్బతినవని సన్యాల్ తెలిపారు. ఇందుకు రూ.320 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పైపులైన్ల నిర్మాణ పనులను ఓఎన్జీసీ, గెయిల్ సంయుక్తంగా చేపట్టాయని, థర్డ్ పార్టీగా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఉందని చెప్పారు. కేజీ బేసిన్ పరిధిలో 800 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్‌లైన్లు విస్తరించి ఉన్నాయన్నారు. వీటిలో 4, 6 అంగుళాల పైపులైన్లు మారుస్తున్నామన్నారు. ఇప్పటికే 25 శాతం మార్పులు చేశామని చెప్పారు. ప్రపంచంలో చమురు, గ్యాస్ ఉత్పత్తుల వెలికితీతలో ఓఎన్‌జీసీ మూడో స్థానంలో నిలిచిందని వివరించారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ (సీఆర్‌ఎఫ్) కోసం టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ సైన్స్ ఆయా గ్రామాల్లో సర్వే చేపట్టిందని, ఓఎన్జీసీ సీఎండీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక అందజేసిందని, దీని ప్రకారం సీఆర్‌ఎఫ్ నిధులు ఖర్చు చేస్తామని సన్యాల్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో జనరల్ మేనేజర్ శర్మ కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement