పక్కా ఇళ్లు కట్టుకోనివ్వరా ? | Officials for permission to walk around | Sakshi
Sakshi News home page

పక్కా ఇళ్లు కట్టుకోనివ్వరా ?

Mar 22 2016 2:33 AM | Updated on Sep 3 2017 8:16 PM

పక్కా ఇళ్లు కట్టుకోనివ్వరా ?

పక్కా ఇళ్లు కట్టుకోనివ్వరా ?

ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు ఇచ్చిన నివేశన స్థలాల్లో ఇళ్లు నిర్మించవద్దంటూ అధికారులు బెదిరిస్తున్నారని ...

అనుమతుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
తాత్కాలిక సచివాలయానికి సమీపంలో స్థలాలు ఉండడమే నేరమా?
మల్కాపురం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఆవేదన

 
తుళ్ళూరు : ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు ఇచ్చిన నివేశన స్థలాల్లో ఇళ్లు నిర్మించవద్దంటూ అధికారులు బెదిరిస్తున్నారని మల్కాపురం ఎస్సీ, ఎస్టీ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. 2011లో అప్పటి మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కృషితో అప్పటి తహశీల్దార్ కేఈ సాధన 50మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రెండు సెంట్లు వంతున మల్కాపురం చెరువు పక్కన నివేశన స్థలాలు ఇచ్చారు. ఇందులో ఒక్కొక్కరుగా గుడిసెలు వేసుకుని లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. అక్కడ మౌలిక వసతులు కూడా లేవు.  రెండేళ్లుగా ఇంటి పన్ను కూడా కడుతున్నారు.

రాజధాని ప్రకటన నేపథ్యంలో మల్కాపురంలో నివాసం ఉంటున్న లబ్ధిదారులు పక్కా ఇళ్లు కట్టుకోవాలని సిద్ధపడ్డారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతుల కోసం అధికారులను కలుస్తున్నప్పటికీ సమాధానం దాటవేస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి వీరి స్థలాలు సమీపంగా ఉండడం వల్లే అధికారులు మిన్నకుంటున్నారని సమాచారం. తమ ప్రాంతానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని లబ్ధిదారులు పంచాయతీ కార్యాలయానికి వెళ్లినా అధికారులు నిరాకరిస్తున్నారు.

విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇటీవల ఒక పిల్లవాడు పాముకాటుకు గురయ్యాడు. సకాలంలో చికిత్స అందించడంతో బాలుడిని కాపాడుకోగలిగామని స్థానికులు తెలిపారు.తమ ప్రాంతంలో అంతర్గత రోడ్లు కూడా లేవని, కనీసం తాగునీరు కూడా రావడం లేదని వారు వాపోతున్నారు. సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్న తమకు అండగా నిలవాలని వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఎం.రవికి లబ్ధిదారులు విన్నవించారు.

 పేదల స్థలాలు వెనక్కి తీసుకుంటే సహించేది లేదు..
ఎన్నో సంవత్సరాలుగా పోరాడితేగాని అప్పట్లో ఇళ్లు లేని నిరుపేదలకు నివేశన స్థలాలు కేటాయించారని వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఎం.రవి తెలిపారు. ప్రభుత్వం మల్కాపురం చెరువు పక్కన మంజూరు చేసిన స్థలాల్లో గూడు వేసుకుని పేదలు నివాసం ఉంటున్నారని, ఆ ప్రాంతంలో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.

లబ్ధిదారులపై సాకు చూపి స్థలాలు వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు బెదిరింపులకు పాల్పడడం సరైన చర్య కాదన్నారు. ఈ విషయమై మండల తహశీల్దార్, జిల్లా కలెక్టర్‌లను కలిసి వివరిస్తామన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేపడతామని రవి తెలిపారు.
 
 
 ఇల్లు కట్టుకుంటామంటే..
 అనుమతుల్లేవంటున్నారు..
 2011లో ప్రభుత్వం మల్కాపురంలో అందించిన నివేశన స్థలాల్లో గుడిసె నిర్మించుకొని ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నాం.  రెండు నెలలుగా పక్కా ఇల్లు కట్టుకోవాలని సిద్ధంగా ఉండగా.. అనుమతులు లేవంటూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మాకిచ్చిన స్థలాలు లాక్కుంటారేమోనని భయంగా ఉంది.
 - గోచిపాత రత్నకుమారి, మల్కాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement