ఇల్లలకాగానే పండుగ కాదన్నట్టుగా రిజర్వేషన్ల పుణ్యాన సర్పంచ్‌గా మహిళలు ఎన్నిక కాగానే వారికి స్వాతంత్య్రం వచ్చినట్టు కాదనే విషయాన్ని మరోసారి రుజువైంది.
సాక్షి, నెల్లూరు: ఇల్లలకాగానే పండుగ కాదన్నట్టుగా రిజర్వేషన్ల పుణ్యాన సర్పంచ్‌గా మహిళలు ఎన్నిక కాగానే వారికి స్వాతంత్య్రం వచ్చినట్టు కాదనే విషయాన్ని మరోసారి రుజువైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు పాలకులు 50 శాతం రిజర్వేషన్ కల్పిం చారు.
ఇన్నాళ్లు వంటింటికే పరిమితమైన మహిళలు రిజర్వేషన్ కారణంగా అధికార పగ్గాలు చేపట్టి సుపరిపాలన అందిస్తారని ఆశించిన వారికి నిరాశ మిగిల్చిన ఘటన ఉదయగిరిలో చోటు చేసుకొంది. ఉదయగిరి మేజర్ పంచాయతీ సాధారణ సమావేశం గురువారం అక్కడి పంచాయతీ కార్యాలయంలో జరిగింది. ఉదయగిరి సర్పంచ్ ముబీనా. సమావేశానికి ఆమె అధ్యక్షత వహించాలి. అయితే అందుకు విరుద్ధంగా ఆమె భర్త, 11వ వార్డు సభ్యుడు రియాజ్ అన్నీ తానే సమావేశాన్ని నిర్వహించాడు. సాక్షాత్తు ఈఓ శ్రీనివాసులు సమక్షంలోనే సర్పంచ్ హక్కులను కాలరాసేలా ఆమె భర్త ప్రవర్తించినా ఆయన నోరు మెదపడక పోవడం విమర్శలకు తావిచ్చింది.
రియాజ్ పెత్తనాన్ని అడ్డుకుని ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాల్సిన ఈఓ, అందుకు భిన్నంగా ఆయనకే తానాతందానా అనడం అధికార పక్షానికి కొమ్ము కాయడమేనని సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ అండదండలున్న తనకు నిబంధనలు వర్తించవన్నట్టుగా పంచాయతీ అభివృద్ధిపై సర్పంచ్ హోదాలో మాట్లాడటం ఆశ్చర్యపరచింది. అధికార పార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ భార్య అధికారాన్ని లాక్కొని పెత్తనం చెలాయిస్తున్న రియాజ్ వ్యవహారశైలిపై ఉదయగిరిలో చర్చనీయాంశమైంది.