అమ్మో.. పోలీస్‌!

Number of Deaths in Police Custody is causing Fear - Sakshi

ఫ్రెండ్లీగా ఉన్నామని చెబుతున్నా ఆగని లాకప్‌ మరణాలు

గతేడాది తొమ్మిది మంది దుర్మరణం

చిన్నపాటి నేరాలకే ప్రాణాలు మూల్యం

ఎన్ని ట్రీట్‌లు నిర్వహించినా విచారణ తీరు మారలేదు

లాకప్‌ మరణాలకు చెక్‌ పెట్టేలా చర్యలు చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం      ‘పోలీస్‌’ పేరు వినంగానే హడలెత్తిపోతున్న సామాన్యులు

పోలీస్‌ అంటే ఒక ధైర్యం.. ఒక భరోసా.. అండగా ఉంటారు.. ఆపదలో కాపాడతారనేది అందరి నమ్మకం. అయితే కొందరి చర్యల వల్ల ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. చిన్నపాటి ఘటనల్లో పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కాల్సి వచ్చినప్పుడు సామాన్యులు వణికి పోతున్నారు. ఎక్కడైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు పోలీస్‌ కనిపిస్తే వేధిస్తారేమోననే భయంతో తప్పుకుని వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

సాక్షి, అమరావతి :ఫ్రెండ్లీ పోలీసింగ్, హైటెక్‌ పోలీసింగ్‌.. ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబు నోట తరచూ విన్పించే మాటలు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనేందుకు లాకప్‌ మరణాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చిన్నపాటి తప్పులకే పోలీసు విచారణలో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇలా ఒకటి, రెండు కాదు. గడిచిన ఏడాదిలో ఏకంగా తొమ్మిది మంది పోలీసుల దెబ్బకు విగతజీవులుగా మారిపోయారు. ‘లాకప్‌ డెత్‌’లను నివారించడంలో రాష్ట్ర సర్కారు ఘోర వైఫల్యాన్ని ఇటీవల మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖ బట్టబయలు చేసింది. విచారణకు తీసుకొచ్చి రోజుల తరబడి పోలీస్‌ ఠాణాలో పెట్టి నేరం అంగీకరించేలా చేస్తున్న పోలీస్‌ మార్క్‌ థర్డ్‌ డిగ్రీ ప్రయోగం నిందితుల ప్రాణాల మీదకు వస్తోంది. చిన్నపాటి నేరాలు చేసిన వారిపై సైతం పోలీసు ప్రతాపం చూపించడంతో ప్రాణాలు కోల్పోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇలా రాష్ట్రంలో గతేడాది తొమ్మిది మంది దుర్మరణం చెందారు. వారిలో ఐదుగురు పోలీస్‌ స్టేషన్‌లలోనే ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు బయటకు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారు. మరొకరు గుండె ఆగి మృతి చెందారు. ఇంకా అనేక మంది పోలీసుల వేధింపుల బారిన పడి ఎవరికీ చెప్పుకోలేక బాధ పడుతున్నారు.

పోలీసు ఠాణాల్లో మరణ మృదంగం
రాష్ట్రంలోని పోలీస్‌ ఠాణాల్లో మరణ మృదంగం మోగుతోందంటూ మానవ హక్కుల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన ఏడాది జరిగిన లాకప్‌ డెత్‌ల తీరును గమనిస్తే ప్రభుత్వ వైఫల్యం తేట తెల్లమవుతోంది. వాటిని ఒకసారి పరిశీలిస్తే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ అనే మాట నీటి మూట అని చెప్పక తçప్పదు.

  • ప్రకాశం జిల్లా ఉలవపాడు పోలీసుల దెబ్బలకు తాళలేక బాబర్‌ బాషా(28) అక్టోబర్‌ 9న మృతి చెందాడు. ఇన్నోవా దొంగతనం కేసులో అతన్ని మూడు రోజులపాటు పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టడంతో చనిపోయినట్టు బంధువులు ఆరోపించారు.
  • పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన జాషువా నాగదాసు(19) అక్టోబర్‌ 6న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమై పోలీసులు తనను తీసుకెళ్లి కొట్టారని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ తన తండ్రికి రాసిన 12 పేజీల సూసైడ్‌ నోట్‌(లేఖ)లో మృతుడు పేర్కొనడం గమనార్హం.
  • ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం చీమలాపురం గ్రామానికి చెందిన పారిపల్లి రామునాయుడు ఏప్రిల్‌ 24న పోలీసులకు లొంగిపోయాడు. ఆ మరునాడే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిచ్చింది.
  • కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సయ్యద్‌ షబ్బీర్‌(25)ను దొంగతనం కేసులో కర్నూలు త్రీటౌన్‌ పోలీసులు ఆగస్టు 21న అదుపులోకి తీసుకున్నారు. ఆ మర్నాడే కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో శవమై కన్పించాడు.
  • విశాఖపట్నం సీసీఎస్‌ పోలీసులు ప్రయోగించిన థర్డ్‌ డిగ్రీతో విజయనగరానికి చెందిన గొర్లె పైడిరాజు(26) సెప్టెంబర్‌ 10న దుర్మరణం పాలయ్యాడు.
  • కర్నూలు జిల్లా డోన్‌ పోలీసుల వేధింపులతో తోపుడు బండి వ్యాపారి వరదరాజులు గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య అప్పట్లో ఆరోపించింది.
  • గుంటూరు జిల్లా మంగళగిరి శివారు రత్నాలచెరువు ప్రాంతానికి చెందిన బూసిరాజు గోపిరాజు(22) అక్టోబర్‌ 30న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక దొంగతనం కేసులో పోలీసులు చిత్రహింసలు పెట్టారని, అందుకే చనిపోతున్నానంటూ తన ఆత్మహత్యను సెల్ఫీ వీడియో తీసుకోవడం అప్పట్లో కలకలం రేపింది.
  • తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వరరావును సెల్‌ఫోన్‌ చోరీ కేసులో నవంబర్‌ 15న రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను 16న సామర్లకోట రైల్వే స్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై శవమై కన్పించడంతో పోలీసుల తీరుపై అనుమానాలు రేగాయి.

లాకప్‌ డెత్‌లను నివారించాలి
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం లాకప్‌ డెత్‌ల నిరోధానికి చర్యలు తీసుకున్నప్పుడే ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనే ఆర్బాటపు ప్రకటనలకు అర్థం ఉంటుంది. నిందితులను విచారించే పద్దతుల్లో పోలీసుల్లో మార్పు రావాలి. లాకప్‌ మరణాలను సీరియస్‌గా తీసుకుని వాటికి కారణమైన పోలీసులపై శాఖాపరమైన దర్యాప్తులతో సరిపెట్టకుండా సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టి శిక్ష పడేలా చేయాలి. ఎవరినైనా అదుపులోకి తీసుకున్నప్పుడు పోలీసులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి సుప్రీం కోర్టు (1997) మార్గదర్శకాలను పాటించాలి.
– యూజీ శ్రీనివాసులు, మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top