
జన్మభూమిలో పోలీసుల రాజ్యం తగదు..
గ్రామాల్లో పేద ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ....
ఎంపీపీ పచ్చల రత్నకుమారి
కురగల్లు (మంగళగిరి రూరల్) : గ్రామాల్లో పేద ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం పోలీసుల రాజ్యంలా మారిందని ఎంపీపీ పచ్చల రత్నకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కురగల్లు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ పల్లబోతు వెంకటశివరావు అధ్యక్షతన జన్మభూమి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నీరుకొండ గ్రామానికి చెందిన మాదల రాజా గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు సభలో ప్రకటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ అధికారులకు సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న పేదలను పోలీసులు అడ్డుకుకోవడం తగదన్నారు. గతంలో రెండు మార్లు జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించారని, అయినా ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. గ్రామాల్లో పేదలకు రేషన్ కార్డులు, పింఛన్లు అందించడంలో అధికారులు కాలయాపన చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దరఖాస్తులను బుట్టదాఖలాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కురగల్లు గ్రామంలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కౌలు పరిహార చెక్కులు అందలేదని చెప్పారు. దీంతో వారు జీవనోపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే, భూమిలేని రైతులకు, రైతు కూలీలకు ప్రభుత్వం చెల్లించే రూ.2,500 పింఛన్లు సైతం సక్రమంగా పంపిణీ జరగలేదని తెలిపారు. ఇక గ్రామంలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ నిధులు రూ.30 లక్షలతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకాన్ని గ్రామ నడిబొడ్డులో ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆమె సూచించారు. సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కౌలు పరిహార చెక్కులు, పింఛన్లను అందించడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. అందులో భాగంగా కురగల్లు గ్రామస్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినా అధికారులను అర్థం చేసుకుని సహకరిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆకుల జయసత్య, మార్కెట్ యార్డు చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, ఎంపీటీసీ గైరుబోయిన సీతామహాలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి ఎంజే నిర్మల, ఎంపీడీవో జి. పద్మావతి, తహశీల్దార్ విజయలక్ష్మి, ఏవో శ్రీకృష్ణదేవరాయలు, పశు వైద్యాధికారిణి శాంతి, హౌసింగ్ ఏఈ రాజశేఖర్, పీఆర్ ఏఈ శేఖర్, ఈవోఆర్డీ రవికుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డిలతో పాటు పలువురు పంచాయతీ వార్డు సభ్యులు, మండల జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పాటించరా..
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించకుండా ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని, ప్రజల చేత ఎన్నుకోబడిన తమకు అధికారులు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వైఎస్సార్ సీపీ రూరల్ కన్వీనర్, ఎంపీటీసీ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని నిడమర్రు పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం సర్పంచ్ మండెపూడి మణెమ్మ అధ్యక్షతన ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని ఎన్నారై భీమిరెడ్డి ప్రతాపరెడ్డి దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు ఎంపీడీవో పద్మావతి ప్రకటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ మణెమ్మ మాట్లాడుతూ పింఛన్ల ఎంపిక కమిటీలో తనకు ఎందుకు స్థానం కల్పించలేదో అధికారులకు చెప్పాలని ప్రశ్నించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నేతలతో అధికారులు సైతం కుమ్మక్కై రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అర్హులకు అన్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నకుమారి, ఎంపీటీసీ కొదమకొండ్ల నాగరత్నం, మండల ప్రత్యేక అధికారి ఎంజే నిర్మల, ఎంఈవో ఐ. వెంకటేశ్వర్లు, పీఆర్ ఏఈ శేఖర్, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాజశేఖర్, ఏవో శ్రీకృష్ణదేవరాయలు, ఈవోఆర్డీ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకులు పచ్చల శ్యామ్‌బాబు, ఉయ్యూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.