
మొక్కుబడి వైద్యం!
ఆటపాటలతో గడవవలసిన బాల్యం వ్యాధులతో సతమతమవుతోంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు వైద్యానికి దూరమవుతున్నారు.
ఆటపాటలతో గడవవలసిన బాల్యం వ్యాధులతో సతమతమవుతోంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు వైద్యానికి దూరమవుతున్నారు. సర్కారి బడుల్లో చదివే వారిలో ఎక్కువ మంది పేద పిల్లలే. వారిని వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం మొక్కుబడిగా సాగుతోంది. ఈ ప్రభావంతో వారి చదువు సన్నగిల్లుతోంది.
ఈ బాలిక పేరు డోకుల తేజు. గంట్యాడ మండలం పెదవేమలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు వారికి ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. బాలిక పుట్టుకతోనే పౌష్టికాహార లోపంతో బాధపడుతోంది. వైద్యం చేయించడానికి వీరికి వచ్చే ఆదాయం ఏ మూలకూ సరిపోదు. దీంతో వైద్యం చేయించలేక ఉండిపోయారు. బిడ్డ బాధను చూసి కన్నీళ్లు పెట్టడం తప్ప వారు ఏమీ చేయలేకపోతున్నారు. జవ హర్ బాల ఆరోగ్య రక్ష పథకం ఉన్నా ఈ పాపకు ఉపయోగం లేకుండాపోయింది. ఈమెకు ఒక్క సారి కూడా వైద్య పరీక్షలు చేయలేదు.
ఈ బాలుడి పేరు గాదల శివ. గంట్యాడ మండలం పెదవేమలి మండల పరిషత్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతని తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. కొడుకును బాగా చదివించుకోవాలన్న ఆశ ఉన్నా స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. వారి పేదరికానికి తోడు శివకు వినిపించదు. ఈ లోపం బాలుడి పాలిట శాపంగా మారింది. వైద్యం చేయించాలని ఉన్నా చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ బాబు తల్లిదండ్రులు కొట్టుమిట్టుడుతున్నారు. దీంతో సర్కారీ వైద్యంపైనే భారం వేసి ఊరుకున్నారు. ఈ బాలుడికి కూడా ఒక్కసారీ వైద్య పరీక్షలు చేయలేదు.
ఈ బాలిక పేరు శెశెట్టిపాప. పెదవేమలి పాఠశాలలో మూడోతరగతి చదువుతోంది. పాప తల్లిదండ్రులు చిన్నపాటి కూరగాయల దుకాణం పెట్టుకుని బతుకు బండి లాగిస్తున్నారు. ఈ బాలికకు మూడేళ్లుగా మానసిక స్థితి బాగోలేదు. వీరి ఆదాయం కుటుంబ పోషణకే చాలడం లేదు. దీంతో తమ గారాల పట్టికి వైద్యం చేయించలేకపోయారు. దీంతో బాలిక పాఠశాలకు వెళుతున్నా ఉపాధ్యాయుడు చెప్పింది అర్థం చేసుకోలేక బిత్తర చూపు లు చూస్తూ కూర్చుంటోంది. ఇటువంటి బాలికలకు వైద్యం చేయించడానికి ఏర్పా టు చేసిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం అమలులో ఉన్నా ప్రయోజనం లేకుండాపోతోంది. ఈమెకు ఈ మూడేళ్ల కాలంలో ఒక్కసారి కూడా వైద్య పరీక్షలు చేయలేదు.
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్:
విద్యార్థులను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జవహర్ బాల ఆరోగ్య రక్ష వల్ల ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. ఏ పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. చెవి, ముక్కు, గొంతు, దంత, నేత్ర తదితర వ్యాధులతో విద్యార్థులు బాధ పడుతున్నారు. 2013-14 సంవత్సరంలో 2,518 మంది విద్యార్థులు పలు వ్యాధుల బారిన పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
885 పాఠశాలల విద్యార్థులు వైద్య పరీక్షలకు దూరం
జిల్లాలో 2,935 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,050 పాఠశాల విద్యార్థులకు మాత్రమే వైద్య పరీక్షలు చేశారు. 885 పాఠశాల విద్యార్థులకు వైద్యపరీక్షలు జరగలేదు. 2,935 పాఠశాలల్లో 2,60,500 మంది విద్యార్థులుండగా అందులో 1,61,394 మంది విద్యార్థులకు మాత్రమే వైద్య పరీక్షలు చేశారు. దీనినిబట్టిఈ పథకం ఎంత అధ్వాన స్థితిలో నడుస్తుందో అర్థమవుతుంది.
ప్రతి వారం ఏఎన్‌ఎం లేదా పారామెడికల్ సిబ్బంది వైద్య పరీక్షలు చేయాలి. ఏడాదికి రెండు పర్యాయాలు సంబంధిత పీహెచ్‌సీ వైద్యాధికారి విద్యార్థులను పరీక్షించాలి. అయితే కింద స్థాయి సిబ్బంది అప్పుడప్పుడు వైద్య పరీక్షలు చేస్తున్నారు తప్ప, వైద్యులు పాఠశాలల ముఖం చూడడం లేదు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా... వేలాది మంది విద్యార్థులు వివిధ రకాల వ్యాధులతో ఏళ్ల తరబడి బాధపడుతున్నారు. పథకం ప్రారంభమై మూడేళ్లవుతున్నా జిల్లాలో వేలాది మంది విద్యార్థులకు ఒక్కసారి కూడా వైద్య పరీక్షలు జరగలేదు.
మొక్కుబడిగా వైద్య పరీక్షలు
వారం వారం ఏఎన్‌ఎం వచ్చి మొక్కుబడిగా పరీక్షలు చేసి వెళ్లిపోతున్నారు. వైద్యులు ఒక్కసారి కూడా పాఠశాలకు రాలేదు. దీంతో పిల్లల సమస్యలు పరిష్కారం కావడం లేదు.
- కె.వి.డి. అప్పారావు, ప్రధానోపాధ్యాయులు, ఎంపీపీ స్కూల్, పెదవేమలి
వాస్తవమే...
విద్యార్థులకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయని మాట వాస్తవమే. ఈ ఏడాది పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేసేందుకు కృషి చేస్తాం.
-బి.సుబ్రహ్మణ్యం, జవహర్ బాల ఆరోగ్య రక్ష జిల్లా మెడికల్
కోఆర్డినేటర్