‘గ్రీన్‌’ కండిషన్‌

National Green Tribunal Judgment on Amaravati Construction with some conditions - Sakshi - Sakshi

పలు షరతులతో అమరావతి నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తీర్పు

సాక్షి, న్యూఢిల్లీ: నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) పలు షరతులు విధించింది. సుస్థిరమైన అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా ఒక భాగమనే విషయం గుర్తించాలని పేర్కొంది. నదుల సహజ ప్రవాహ దిశను మార్చడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. వరద ముంపు ప్రాంతాల్లో మార్పులు చేపట్టాలంటే అందుకు సంబంధించి అధ్యయనం చేయాలని తెలిపింది. పర్యావరణ అనుమతి (ఈసీ)కి అదనంగా పలు షరతులు విధించింది. తమ ఆదేశాల అమలుకు వీలుగా, పర్యావరణ పరిరక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ తెలిపింది. ఈమేరకు 145 పేజీల తీర్పును వెలువరించింది.

ప్రతిపాదిత రాజధాని నగర నిర్మాణానికి వరద ముప్పు ఉందని, బహుళ పంటలు పండే భూములు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంటూ పి.శ్రీమన్నారాయణ, అంతటి కమలాకర్, బొలిశెట్టి సత్యనారాయణ 2015లో ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతి (ఈసీ) లోపభూయిష్టంగా ఉందని, దానిని రద్దు చేయాలని కోరుతూ మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ కూడా పిటిషన్‌ వేశారు. గతంలోనే జస్టిస్‌ స్వతంతర్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను పూర్తి చేసినా.. తీర్పును రిజర్వ్‌ చేసి శుక్రవారం వెల్లడించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఒకే తీర్పును వెల్లడిస్తున్నట్టు జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సంజయ్‌ పారిఖ్, పారుల్, కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించగా, ప్రతివాదుల తరపున ఏకే గంగూలీ, గుంటూరు ప్రభాకర్, ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాసరావు తమ వాదనలు వినిపించారు.

అయితే ఎన్జీటీ షరతులు రాజధాని నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీర్పులో సహజ నీటి ప్రవాహాల దిశలను మార్చరాదని ట్రిబ్యునల్‌ పేర్కొనడం ప్రధానమని చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో దాదాపు 10 వేల ఎకరాలున్న చిత్తడి నేలల్లో కట్టడాలకు ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉండటం, కొండవీటి వాగు ముంపు ప్రాంతంలో దాదాపు 15 వేల ఎకరాలు ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తీర్పు ఇబ్బంది కలిగిస్తుందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ 25 వేల ఎకరాలు మినహాయిస్తే మాస్టర్‌ప్లాన్‌ పూర్తిగా మార్చాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అప్పుడు మళ్లీ అనుమతులన్నీ మొదటికి వస్తాయని చెబుతున్నారు. 

ఈసీకి షరతులు..
స్టేట్‌ లెవల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) 2015 అక్టోబర్‌9న జారీ చేసిన ఈసీని పక్కకు పెట్టాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని, అయితే ఈసీ షరతులకు అదనంగా మరికొన్ని షరతులు విధించడం అవసరమని ఎన్జీటీ తీర్పులో పేర్కొంది. వీటిని ఈసీలోని షరతులుగా పరిగణించాలని పేర్కొంది. పదేళ్లలోగా రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంతో పాటు ఇప్పటివరకు జరిగిన పనిని కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని తీర్పులో పేర్కొంది. అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సంతులన విధానాన్ని పాటించడం ద్వారా ఆర్థికవృద్ధి సాధ్యమని పేర్కొంది. ‘‘ అమరావతి నిర్మాణానికి చట్టంలో కాలపరిమితి ఉంది. ఇప్పటికే పలు పనులు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ‘ఫెయిట్‌ అకంప్లి’ (కొనసాగించక తప్పని పరిస్థితి) సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఉన్న దశ నుంచి వెనక్కి రావాలంటే భారీ మూల్యం చెల్లించడం ద్వారానే సాధ్యమవుతుంది. అది కేవలం ఆర్థికంగానే కాదు. ఇప్పటికే ఏర్పాటైన మౌలిక వసతులను కూల్చాలంటే పర్యావరణం, ప్రజలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు ఆయా ప్రాజెక్టుల తదుపరి పనులను పూర్తిచేసేందుకు అనుమతించేలా సంతులన విధానం పాటిస్తున్నాయి. అలాగే అవి పర్యావరణ పరిరక్షణకు తగిన రక్షణ చర్యలను ఆదేశిస్తున్నాయి’’ అని తన తీర్పులో ఎన్జీటీ పేర్కొంది. 

ఈసీకి అదనంగా విధించిన 9 షరతులు ఇవీ
- సమర్థవంతమైన నీటి సంరక్షణ ప్రణాళిక రూపొందించుకునేందుకు రాజధాని ప్రాంతం లో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర హైడ్రోజియోమా ర్ఫాలజీ అధ్యయనం చేయించాలి. చెరువులు, జలాశయాలు, వరద నీటి కాలువలు, అంతర్గత అనుసంధానంతో కూడిన నీటి నిర్వహణ ప్రణాళిక ఉంటే నీటి సంరక్షణ చర్యలను మెరుగ్గా చేపట్టవచ్చు. 
వరద నీటి కాలువలు, నీటి నిలువ కోసం నిర్మించే చెరువులు, సంబంధిత అభివృద్ధి పనుల కోసం ఫ్లడ్‌ ప్లెయిన్స్‌ (వరద ప్రాంతాలు)లో మార్పులు చేపట్టాలంటే అందుకు సంబంధించి అధ్యయనం చేసిన తరువాతే చేపట్టాలి.
నది గానీ, సహజ వరద నీటి ప్రవాహ పద్ధతిని గానీ, ప్రవాహ దిశను గానీ మార్చేందుకు అనుమతి లేదు. ప్రవాహ దిశను స్ట్రెయిట్‌గా చేయడానికి అనుమతించడం లేదు. అలాంటి మార్పుల వల్ల నేల కోతకు గురవుతుంది. భూగర్భ నీరు తగ్గుతుంది. 
ప్రతిపాదిత రాజధాని నగరంలో వరద రక్షణ చర్యలకు మినహాయించి మరే ఇతర సందర్భాల్లోనూ ఇంతకు ముందే ఉన్న కట్టడాల్లో మార్పు చేయరాదు. వరద ప్రవాహ నమూనాపై సమగ్రమైన అధ్యయనం చేసిన తరువాతే పనులు చేపట్టాలి.
- ప్రతిపాదిత నగరంలో నివాస, నివాసేతర ప్రాంతాల్లో ఘన వ్యర్థాలను ఎక్కడికక్కడ కంపోస్టింగ్‌ లేదా బయోమెథనేషన్‌ పద్ధతుల ద్వారా నిర్మూలించాలి.
వర్షపు నీటి సంరక్షణ పద్ధతులు, సౌర శక్తి వినియోగం, నీటి పొదుపు పరికరాల బిగింపు, వినియోగించిన నీటిని శుద్ధి చేసి ఇతర అవసరాలకు వినియోగించడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాల నిబంధనలను నోటిఫై చేయాలి. 
వాతావరణ మార్పుల ప్రభావ తగ్గింపునకు ఒక సమగ్రమైన సిటీ ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. వచ్చే 6 నెలల్లో రంగాల వారీగా రోడ్‌ మ్యాప్‌ తయారు చేయాలి. 
కొండవీటి వాగు, దాని ఉప వాగులు, ఇతర వరద కాలువల పరీవాహక ప్రాంతంలో నీటి సంరక్షణ దిశగా చర్యలు చేపట్టాలి. ఉపరితలంపై ప్రవాహ వేగం తగ్గించేందుకు, భూగర్భ నీటి నిల్వ పెంచేందుకు అటవీకరణ చేపట్టాలి.
రాజధాని నగరంలో ఉన్న 251 ఎకరాల అటవీ స్థలాన్ని సంరక్షించాలి. అటవీయేతర అవసరాలకు వినియోగించరాదు. కనీసం పార్కులు, వినోద కార్యక్రమాలకు ఆ భూమిని వినియోగించరాదు.

రెండు కమిటీలు.. వాటి పాత్ర..
తీర్పులో ఇచ్చిన ఆదేశాల అమలుకు వీలుగా, పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో ప్రాజెక్టు నియంత్రణ, పర్యవేక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ తెలిపింది. అందులో ఒకటి సూపర్‌వైజరీ కమిటీ. ఇందులో చైర్మన్, నోడల్‌ అధికారి సహా ఆరుగురు సభ్యులు ఉంటారు. దీనికి కేంద్ర పర్యావరణ విభాగం అదనపు కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. ఏపీ పర్యావరణ శాఖ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ నోడల్‌ అధికారిగా ఉంటారు. ఇందులో సభ్యులుగా.. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ సంస్థ డైరెక్టర్‌ నామినేట్‌ చేసే సీనియర్‌ సైంటిస్ట్, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ డైరెక్టర్‌ నామినేట్‌ చేసే సీనియర్‌ సైంటిస్ట్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, పుణే వర్సిటీలోని జియాలజీ విభాగ ప్రొఫెసర్‌ ఎన్‌జే పవార్‌ సభ్యులుగా ఉంటారు. రెండో కమిటీ ఇంప్లిమెంటేషన్‌ కమిటీ. ఇందులో రాష్ట్ర పర్యావరణ విభాగం అదనపు చీఫ్‌ సెక్రటరీ చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా.. పర్యావరణ మంత్రిత్వ శాఖ నామినీ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ డైరెక్టర్‌ నామినేట్‌ చేసే సీనియర్‌ సైంటిస్ట్, అనంతపురం ఎస్కేయూ మైక్రోబ యాలజీ విభాగం పూర్వ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కడియాల వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉంటారు.

కమిటీలు ఏం చేయాలి?
- సూపర్‌ వైజరీ కమిటీ కనీసం మూడు నెలలకోసారి సమావేశమై విధాన మార్గదర్శకాలకు తుదిరూపు ఇవ్వాలి. పర్యావరణ అనుమతుల(ఈసీ)లో ఉన్న షరతులు, ప్రస్తుత తీర్పులో ఉన్న షరతులను రాష్ట్రప్రభుత్వం అమలు చేసేలా మార్గదర్శకాలు ఉండాలి. 
- ఇంప్లిమెంటేషన్‌ కమిటీ ప్రతి నెలలో సమావేÔశమై ఈ తీర్పులో ఉన్న ఆదేశాలను, సూపర్‌వైజరీ కమిటీ ఇచ్చే మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా చూడాలి. 
- షరతుల అమలుకు కమిటీ ఒక కాలపరిమితి విధించాలి. ప్రాజెక్టు పురోగతికి ఈ కాలపరిమితితో సంబంధం ఉండాలి.
ఈ కమిటీ సమగ్రమైన తనిఖీ నిర్వహించాలి. నీళ్లు, అడవులు, ప్రవాహాలు, చిత్తడి నేలలు, పర్యావరణ, జీవావరణ ప్రభావాలు, కాలుష్య నియంత్రణ వ్యవస్థలాంటివన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు కమిటీ అదనంగా కాలపరిమితితో కూడిన షరతులు లేదా మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవచ్చు. వీటిని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలి. 
కమిటీ ప్రతి 6 నెలలకోసారి గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించాలి. అయితే తొలి నివేదిక మాత్రం ఈ తీర్పు వెలువరించిన తేదీ నుంచి మూడు నెలలకు సమర్పించాలి. ఈ నివేదిక రాగానే తగిన మార్గదర్శకాలు ఇస్తుంది.
- వర్షపు నీటి సంరక్షణ, పునర్వినియోగానికి శుద్ధి చేసిన నీరు, భవన నిర్మాణాలకు ఫ్లైయాష్‌ ఇటుకలు వినియోగించడం వంటి అంశాలకు సానుకూలంగా భవన నిర్మాణ నిబంధనలను ఈసీలో సవరించాలి. కమిటీ ఈ నిబంధనలను కూడా అమలు చేయించాలి.
రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్ల బ్యాంకు గ్యారంటీని కమిటీకి సమర్పించాలి. ఈ తీర్పులోగానీ, ఈసీలో ఉన్న షరతులు గానీ ఉల్లంఘించినప్పుడు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసి కమిటీ ఆ బ్యాంకు గ్యారంటీని జప్తు చేసుకుంటుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top