నంద్యాల నాయకుడెవరో

Nandyal Constituency Review on Andhra Pradesh Election - Sakshi

అసంతృప్తిని మూటగట్టుకున్న

భూమా బ్రహ్మానందరెడ్డి

ప్రచారంలో దూసుకెళుతున్న శిల్పా రవిచంద్ర

నంద్యాల.. కర్నూలు జిల్లాలో అతిముఖ్యమైన నియోజకవర్గం.. ప్రతి ఎన్నికల్లోనూ వార్తల్లో ఉంటుంది.గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసిన భూమా కుటుంబం 2017 ఉప ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీచేసింది. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరి టికెట్‌ దక్కక పోవడంతో ఈసారి జనసేన నుంచి ఎంపీ టికెట్‌పై పోటీచేస్తున్నారు. ఈ ప్రభావం నంద్యాల అసెంబ్లీపై పడి టీడీపీ ఓటుబ్యాంకు చీలే ప్రభావముంది.

నంద్యాల నియోజకవర్గం 1952లో ఏర్పడింది. నంద్యాల పట్టణం, నంద్యాల, గోస్పాడు మండలాలు నంద్యాల నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పటి వరకు 15సార్లు నంద్యాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.  పునర్విభజనలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో ఉన్న బండి ఆత్మకూరు, మహానంది మండలాలను శ్రీశైలం నియోజకవర్గంలో కలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న గోస్పాడు మండలాన్ని నంద్యాల నియోజకవర్గానికి కలిపారు. అత్యధిక సార్లు నంద్యాల అసెంబ్లీ నుండి కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌పై 40,677ఓట్లతో మెజార్టీ సాధించారు.  2014లో టీడీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూమానాగిరెడ్డి 3604 ఓట్లతో గెలుపొందారు. రాష్ట్రపతిగా ఎన్నికైన నీలం సంజీవరెడ్డి ఈ నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. నంద్యాల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన శిల్పా మోహన్‌ రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌లు మంత్రి పదవులు చేపట్టారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం 2,36,709 ఓట్లలో ముస్లిం ఓట్లే 80వేలు.

దూసుకెళుతున్న శిల్పా రవి
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్‌ నాయకుడు శిల్పామోహన్‌రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి వైఎస్సార్సీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శిల్పారవి  నంద్యాల నియోజకవర్గంలో పర్యటించి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి మన్నన పొందుతున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన పల్లెనిద్ర–రచ్చబండ కార్యక్రమాల ద్వారా గ్రామాల్లోకి వెళ్లి కార్యకర్తలు, ప్రజల అభిమానం పొందారు. రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి మాట్లాడారు. శిల్పా సేవా సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.  టీడీపీ నాయకుల అవినీతి కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఎండగట్టారు.

ప్రజాసమస్యలు పట్టించుకోనిభూమా బ్రహ్మానందరెడ్డి
2017లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించిన భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ప్రజలకు ఎమ్మెల్యేగా పరిచయమయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అనేక బెదిరింపులు, దౌర్జన్యాలు, ధనప్రవాహంతో ఎన్నికల్లో గెలుపొందారనే విమర్శలు వినిపించాయి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బ్రహ్మానందరెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆయన కొద్ది రోజుల్లోనే అసంతృప్తిని మూటగట్టుకున్నారు. ఆయన ఇంకా పార్టీపై పట్టు సాధించలేకపోయారు. 

జనసేనలో ఎస్‌పీవై..చీలనున్న టీడీపీ ఓటు బ్యాంక్‌
2014లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి ఆ తరువాత అధికార పార్టీలో చేరిన ఎంపీ ఎస్‌పీవై రెడ్డి ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగారు. దీంతో ఇక్కడి టీడీపీ ఓటు బ్యాంకు రెండుగా చీలిపోనుంది.  – ఏ. బాల మద్దిలేటిసాక్షి, నంద్యాల

నియోజకవర్గం :నంద్యాల
 మొత్తం : 2,36,709
పురుషులు:1,15,775
మహిళలు : 1,05,018
ఇతరులు: 12

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top