పేదల పెన్నిధి.. ఉద్యోగాల సారథి

NAAC In Pulivendula Credit Goes To YS Rajasekhara Reddy Government - Sakshi

సాక్షి, పులివెందుల : పేదల పెన్నిధి.. ఉద్యోగాల సారధిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచారు. ఒకరు ఉద్యోగం చేసినా.. ఆ కుటుంబం బాగుపడుతుందనే ఆశయంతో ఆయన పని చేశారు. ఇందులో భాగంగా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పులివెందులలో 2008న డిసెంబర్‌ 25న నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ రీజనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. దాదాపు 32 ఎకరాల్లో రూ.11 కోట్లతో భవనాలు ఏర్పాటు చేయించారు.

పులివెందుల ప్రాంతంలో నిరుద్యోగ సమస్యలు ఉండకూడదనే లక్ష్యంతో నాక్‌ అకాడమీని నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాక్‌ అకాడమీలో 3,600 మందికి శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 2008 నుంచి 2019 వరకు ఫ్లంబర్, పెయింటింగ్, సర్వేయర్, ఎలక్ట్రికల్‌ కోర్సులలో వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చారు. 2013–14లో నాక్‌ అకాడమీలో 1984 మందికి 2014–14లో 1284 మందికి, 2015–16లో 1327 మందికి, 2016–17లో 550 మందికి, 2017–18లో 398 మందికి, 2018–19లో 75 మందికి శిక్షణ ఇచ్చారు.

కుట్టు మిషన్ల పంపిణీ 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నాక్‌ అకాడమీ ద్వారా నియోజకవర్గంలోని మహిళలకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం నాక్‌ అకాడమీలో శిక్షణ కార్యక్రమాన్ని తీసివేశారు.

నిరుద్యోగ సమస్య ఉండకూడదనే.. 
జిల్లాలో నిరుద్యోగ సమస్య ఉండకూడదనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పులివెందులలో నాక్‌ అకాడమీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా చాలా మంది నిరుపేదలకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. నాక్‌లో మూడు నెలల పాటు శిక్షణతోపాటు ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. 
– జీవయ్య (నాక్‌ శిక్షకుడు), పులివెందుల

వైఎస్‌ మా పాలిట దేవుడు
దివంగత సీఎం వైఎస్‌ ఆర్‌ పేదల పాలిట దేవుడు. ఆయన చొరవతోనే పులివెందుల ప్రాంతంలో నాక్‌ భవనం ఏర్పాటు చేశారు. ఈ అకాడమీ ఏర్పాటు చేయకపోతే ఎందరో నిరుద్యోగులు రోడ్లపై ఉండేవారు. అకాడమీ ఏర్పాటు వల్ల ఇప్పుడు చాలా మంది వివిధ ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. 
– జాకీర్‌(నాక్‌లో శిక్షకుడు), వేంపల్లె

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top