అందుకో ఓ ప్రశంస | Must offer a tribute | Sakshi
Sakshi News home page

అందుకో ఓ ప్రశంస

Jan 26 2014 3:49 AM | Updated on Sep 2 2017 3:00 AM

ఎంతైనా ఈ రోజుల్లో లౌక్యం ఉండాలోయ్ అని గురజాడ కన్యాశుల్కంలోని గిరీశం చెప్తాడు.

ఎంతైనా ఈ రోజుల్లో లౌక్యం ఉండాలోయ్ అని గురజాడ కన్యాశుల్కంలోని గిరీశం చెప్తాడు. ఈ విషయాన్ని మన అధికారులు ఒంట పట్టించుకున్నారు. అయిదు నెలల కిందట జరిగిన స్వాతంత్ర దినోత్సవం వేళ 380 మందిని ఉత్తమ అవార్డులకు  ఎంపిక చేస్తే కేవలం అయిదునెలల కాలంలో రిపబ్లిక్ దినం నాటికి వీరి సంఖ్య 700కు పెంచేశారు. ఇంతమంది నిజంగా సేవలందిస్తే.. ఆహా ఏమి భాగ్యం అని పొంగి పోవద్దు. ఎంపిక చేసిన అధికారులు ఎవరితోనూ చెడ్డకాకుండా ఎక్కువ పేర్లు రాసి కలెక్టర్ కోర్టులో పడేశారంతే. ‘ప్రశంస’ పథకాన్ని విస్తరించారంతే.
 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఏటా రిపబ్లిక్ దినోత్సవ వేళ జిల్లా యంత్రాంగంలో చక్కని సేవలు అందించే వారికి ప్రోత్సహిస్తూ ‘ప్రశంసా పత్రాలు’, అవార్డులు ఇవ్వడం రివాజు. అంత వరకు ఓకే ఈమారు అధికారులు రూపొందించిన జాబితాఏ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కరికీ, ఇద్దరికీ ఇస్తే ఏ లాభం తలా ఓ సర్టిఫెకేట్ పడేస్తే చాలదా అనుకున్నారేమో ఏకంగా కొండవీటి చాంతాడంత లిస్ట్‌ను తయారు చేసి జిల్లా కలెక్టర్‌నే సందిగ్ధంలో పడేశారు. వల పక్షంతో సేవలతో పనిలేకుండా తమకు నచ్చిన వారికి మెచ్చుకుంటూ జాబితా తయారు చేశారన్న విమర్శలు సాటి ఉద్యోగుల నుంచే వస్తున్నాయి. ఈ ఎంపిక కోసం  ప్రతీశాఖ  కొందరిని ఎంపికచేసి జాబితాను కలెక్టర్‌కు పంపిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా జిల్లాలో కొన్నిశాఖల అధికారులు ఉత్తమసేవలను అందించినవారిని పక్కనపెట్టి  తమకు అనుకూలంగా ఉండేవారి పేర్లను ప్రతిపాదించినట్లు  సమాచారం.
 
 ఇక ఓ అధికారి అయితే ఏకంగా 20 మంది పేర్లను పంపించాలని కిందిస్థాయి సిబ్బందికి చెప్పి ఎవరికీ చెడ్డకాకుండా లౌక్యం ప్రదర్శించారట. ‘ మాకు ప్రతిభ అవసరం లేదు, అనుకూలంగా ఉంటే చాలు..కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రశంసాపత్రంతోపాటు అవార్డును అందజేయిస్తాం’ అని  సాక్షాత్తూ మరో అధికారి చెప్పడం విడ్డూరం. ఇలా ఈ జాబితా గతేడాది ఆగస్టులో అందజేసిన ప్రశంసాపత్రాల  కంటే రెండింతలుగా పేర్లను చేర్చి కలెక్టర్ వద్దకు చేర్చారు. అంటే కేవలం ఐదునెలల కాలంలోనే ఇంతమంది ఉత్తమ సేవలు అందించరా? అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. ఇక ఈ ప్రక్రియను కొన్నిశాఖల అధికారులు మొక్కుబడిగా పూర్తిచేశారని తెలుస్తోంది.
 
 కంగుతిన్న కలెక్టర్
 ఈసారి జిల్లాలోని 90 శాఖల్లో 700మందికి పైగా ఉద్యోగులు ప్రశంసాపత్రాల స్వీకరణకు అర్హులుగా పేర్కొంటూ శనివారం సాయంత్రానికి  అన్ని శాఖల అధికారులు తమ జాబితాలను కలెక్టర్‌కు అందజేశారు. అవార్డు గ్రహీతలు 300 మందిలోపే ఉండొచ్చని భావించిన కలెక్టర్ ఆ జాబితాను చూసి  కంగుతిన్నారు. వీటిని ఎలా కుదించాలో తెలియక కలెక్టరే తర్జనభర్జన పడాల్సి పరిస్థితి ఎదురైంది. ఇందుకోసం శనివారమంతా కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అందించే ప్రశంసాపత్రాలను అధికారులు సిద్ధంచేశారు. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో తేల్చుకోలేకపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement