తల్లీకొడుకులే సూత్రధారులు! | MPTC Kolla Appanna Murder family numbers | Sakshi
Sakshi News home page

తల్లీకొడుకులే సూత్రధారులు!

Jan 8 2015 2:19 AM | Updated on Jul 30 2018 8:29 PM

తల్లీకొడుకులే సూత్రధారులు! - Sakshi

తల్లీకొడుకులే సూత్రధారులు!

టెక్కలిలో గత ఏడాది డిసెంబర్ 25న ఎంపీటీసీ కోళ్ల అప్పన్న హత్య కేవలం ప్రతీకారంతోనే జరిగిందని కాశీబుగ్గ డీఎస్పీ ఎం.దేవప్రసాద్

 టెక్కలి: టెక్కలిలో గత ఏడాది డిసెంబర్ 25న ఎంపీటీసీ కోళ్ల అప్పన్న హత్య కేవలం ప్రతీకారంతోనే జరిగిందని కాశీబుగ్గ డీఎస్పీ ఎం.దేవప్రసాద్ తెలిపారు. 2013లో హత్యకు గురైన కోళ్ల చందర్‌రావు కుమారులతో పాటు సుమారు 12 మంది కలిసి చందర్‌రావు భార్య పార్వతి సహకారంతో అప్పన్నను హత్య చేసినట్లు వెల్లడించారు.  నిందితుల్ని బుధవారం టెక్కలి పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చూపించి అనంతరం విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. అప్పన్న హత్య కేసు సంఘటనపై డీఎస్పీ దేవప్రసాద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.  2013లో జరిగిన కోళ్ల చందర్‌రావు హత్య కేసులో ముద్దాయి అయిన కోళ్ల అప్పన్నను ఎలాగైనా అంతం చేయాలనే ప్రతీకారంతో చందర్‌రావు కుమారులు కోళ్ల వసంతరావు (అలియాస్ అబ్బాస్), కోళ్ల కామేశ్వరరావు, కోళ్ల జనార్ధన్ (అలియాస్ చిన్నా) తో పాటు అతని సన్నిహితులు కైవాడ నవీన్, టెంక హరి, గణేశం శ్రావణ్, చెకూరి ప్రకాశ్ (అలియాస్ బ్రోకర్ ఆఫీస్ చిన్నా)తో పాటు మరో నలుగురు (వారి పేర్లను తెలియజేయడానికి పోలీసులు నిరాకరించారు) చందర్‌రావు భార్య కోళ్ల పార్వతి ప్రోద్బలంతో అప్పన్నను హత్య చేశారు.
 
 అనంతరం నిందితులు ఒడిశా ప్రాంతంలోని గండాహతి, పూరీ, బరంపురం ప్రాంతాలకు పరారయ్యారు. టెక్కలి సీఐ కె.భవానీప్రసాద్, ఎస్‌ఐ నర్సింహమూర్తి, నౌపడ ఎస్‌ఐ రాజేష్‌లతో పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి మంగళవారం(జనవరి 6) రాత్రి 10.10 గంటల సమయంలో నందిగాం మండలం సొంటినూరులో రమేష్ క్వారీ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన 8 కత్తులు, మూడు ద్విచక్రవాహనాలు, ఒక ఆటో, ఒక కారు, లగేజీ ఆటో, 10 సెల్‌ఫోన్లు, మంకీ టోపీలను స్వాధీనం చేసుకున్నారు. అప్పన్నను హత్య చేయడానికి చందర్‌రావు కుటుంబ సభ్యులు  కొంత కాలంగా పథకం వేసినట్లు తమ విచారణలో తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు.
 
 ఇందులో భాగంగా ధన్‌బాద్ ప్రాంతం నుంచి 8 కత్తులు కొనుగోలు చేశారన్నారు. గతంలో టెక్కలి కోర్టు నుంచి అప్పన్న వస్తుండగా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మాటువేశారని, రెండు నెలల తర్వాత టెక్కలి సమీపంలో ఎన్‌ఆర్‌ఎల్ బంక్ వద్ద కాపలా కాశారని, అనంతరం నెల రోజుల తర్వాత కోటబొమ్మాళి సమీపంలో కన్నెవలస పెట్రోల్ బంక్ వద్ద రెక్కీ నిర్వహించారని, చివరకు గత ఏడాది డిసెంబర్ 25న టెక్కలి మండాపొలం కాలనీ వద్ద హత్య చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులపై ఐపీసీ 147, 148, 302,307, 452, 427, 120బీ, ఆర్/డబ్ల్యూ(రెడ్‌విత్) 149 సెక్షన్‌లను నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లోని ప్రధాన ముద్దాయిలైన కోళ్ల చందర్‌రావు కుమారులపై గతంలో రౌడీషీట్లు ఉన్నందున వారిని జిల్లా నుంచి బహిష్కరించడానికి చర్యలు చేపడుతున్నామ డీఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచేందుకు తరలించారు. సమావేశంలో సీఐ కె.భవానీప్రసాద్, ఎస్‌ఐలు పి.నర్సింహమూర్తి, రాజేష్‌లతో పాటు క్రైం సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement