ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు త్వరలో శంకుస్థాపన | MMTS phase II works to start soon | Sakshi
Sakshi News home page

ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు త్వరలో శంకుస్థాపన

Oct 19 2013 12:18 AM | Updated on Sep 1 2017 11:45 PM

లింగంపల్లి నుంచి రామచంద్రాపురం వరకు రానున్న ఎంఎంటీఎస్ కోసం చేపట్టే పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు మెదక్ ఎంపీ విజయశాంతి తెలిపారు.

రామచంద్రాపురం, న్యూస్‌లైన్: లింగంపల్లి నుంచి రామచంద్రాపురం వరకు రానున్న ఎంఎంటీఎస్ కోసం చేపట్టే పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు మెదక్ ఎంపీ విజయశాంతి తెలిపారు. శుక్రవారం ఆమె రామచంద్రాపురంలో విలేకరులతో మాట్లాడారు. తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 4.75 కిలోమీటర్ల లైన్ కోసం రూ.28 కోట్లను వెచ్చిస్తున్నట్టు తెలిపారు. మొదట పటాన్‌చెరుకు ఎంఎంటీఎస్‌ను తేవాలని అనుకున్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల రామచంద్రాపురం వరకే పరిమితమైనట్టు చెప్పారు.
 
 ఈ పనులను లండన్‌కు చెందిన సంస్థ దక్కించుకుందని, ఏడాదిలోపు పనులు పూర్తి కావచ్చన్నారు. ఎంఎంటీఎస్ విషయంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు మారినా ప్రజల ఆశీస్సులతో అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టు చెప్పారు. పనుల శంకుస్థాపన కోసం కేంద్ర రైల్వేశాఖ మంత్రితోపాటు ముఖ్యమంత్రి సమయం తీసుకున్నట్టు తెలిపారు. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు రైల్వేలైన్ పనులను త్వరలో ప్రారంభించేలా కృషి చేస్తానన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నట్టు చెప్పారు. ఓ వైపు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూనే మరోవైపు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు విజయశాంతి తెలిపారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి షేక్ అబ్దుల్ ఘని, టెలికం బోర్డు సభ్యుడు రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement