అయితే మాకేంటీ! | MLAs have not attend to assembly for discussion of state bifurcation | Sakshi
Sakshi News home page

అయితే మాకేంటీ!

Dec 17 2013 12:00 AM | Updated on Sep 27 2018 5:59 PM

ప్రజలంతా ‘తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఏమి జరుగుతుందో?’ అని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సమయంలో..

సాక్షి ప్రతినిధి, కాకినాడ :  ప్రజలంతా ‘తెలంగాణ  బిల్లుపై అసెంబ్లీలో ఏమి జరుగుతుందో?’ అని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సమయంలో.. అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాత్రం సోమవారం కూడా జిల్లాను విడిచి పెట్టకుండా తమ, తమ పనుల్లో తీరిక లేకుండా కనిపించారు. ‘అసెంబ్లీలో టీ బిల్లును గట్టిగా ప్రతిఘటిస్తామన్న’ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అయితే అట్టహాసంగా పుట్టినరోజు జరుపుకొంటూ హాయిగా కాలక్షేపం చేశారు. ఆయన 43వ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్‌లో కాకినాడ ఆర్డీఓ జవహర్‌లాల్‌నెహ్రూ, తహశీల్దార్ జోసెఫ్ సహా పలువురు అధికారులు, పార్టీ నాయకుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు.

రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా హాజరు కావలసి ఉన్న వేళ..  ప్రజల ఆకాంక్షల కంటే పుట్టిన రోజు వేడుకలే ఎక్కువ అయ్యాయా అని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో కలెక్టరేట్ సాక్షిగా కన్నబాబు సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఉత్తుత్తి రాజీనామాలు కాకుండా పదవులు విడిచాకే ఉద్యమంలోకి రావాలని మండిపడటంతో చేసేది లేక వెనుదిరిగారు. ఇంత జరిగినా టీ బిల్లు వచ్చేసరికి అసెంబ్లీకి డుమ్మా కొటట్డమే కాక పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడం సమైక్యవాదులను విస్మయానికి గురిచేసింది.
 ఆ నలుగురూ ఇక్కడే..
 కాగా తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు సోమవారం సాయంత్రం వరకు తునిలోని బ్యాంక్ కాలనీలో తన ఇంటి వద్దే ఉన్నారు. తెలుగుజాతిని నిలువునా చీల్చే బిల్లుపై ఆ రాష్ట్ర శాసనసభలో ఎలాంటి ప్రతిస్పందన ఎదురవుతుందని దేశమంతా ఆత్రుతతో ఉండగా రాజా వారు తీరుబాటుగా ధనుర్మాస ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారుచేయాలని మున్సిపల్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీచేశారు. ఇక పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ గతంలో సమైక్యాంధ్ర కోసం కట్టుబడి ఉంటానంటూ ఉద్యమకారులకు లేఖ కూడా ఇచ్చారు. తీరా అసెంబ్లీలో టీ బిల్లు ప్రవేశపెట్టే సమయానికి నియోజకవర్గంలోని ఆర్‌బీ పట్నంలో రేషన్‌కార్డులు, పెన్షన్‌లకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేస్తూ కనిపించారు. అనపర్తి, పిఠాపురం ఎమ్మెల్యేలు నల్లమిల్లి శేషారెడ్డి, వంగా గీత కాకినాడలోని తమ, తమ నివాసాలకే పరిమితమయ్యారు.
 ఉద్యమస్ఫూర్తిని కొనసాగించిన వైఎస్సార్ సీపీ
 కాగా, మొదటి నుంచి సమైక్య ఉద్యమపథంలో ముందున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో అదే వరవడిని కొనసాగించారు. ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యేలు పినిపే విశ్వరూప్, గొల్ల బాబూరావు అసెంబ్లీకి హాజరై తెలంగాణ బిల్లును తీవ్రంగా ప్రతిఘటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement