కేశవ్‌.. రైతులపై కక్ష సాధింపా?

mla vishweshwar reddy fires on payyavula keshav - Sakshi

చేతికొచ్చిన పంటను నీటముంచడం దారుణం

విప్‌పై ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి మండిపాటు

ఉరవకొండ: ‘‘ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట.. పదిరోజుల్లో ఇంటికి చేరేది.. ఆ లోపే బూదగవి చెరువు కోసమంటూ నీళ్లొదిలారు. చెరువు నిండడం ఏమోగానీ.. ఆ నీరంతా పొలాల్లో చేరడంతో రైతులు నిండా మునిగారు. లక్షలాది రూపాయల నష్టం జరిగింది.. ఓ ఎమ్మెల్సీకి ఆమాత్రం తెలియదా..? రైతుల కడుపుకొట్టడమే పయ్యావుల కేశవ్‌ నైజం’’ అంటూ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. బుధవారం బూదగవి వద్ద చెరువుకు సమీపంలో నీటమునిగిన పప్పుశనగ పంటలను ఆయన పరిశీలించారు. వందల ఎకరాల్లో సాగుచేసిన పంట హంద్రీనీవా నీటితో మునిగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయిందని రైతులు ఎమ్మెల్యే ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓ దార్చిన ఎమ్మెల్యే అనంతరం విలేకరులతో మాట్లాడారు.

నాలుగేళ్ల తర్వాత పంట బాగా పడిందని రైతులంతా సంతోషించారనీ, ఎకరాకు కనీసంగా రూ.50 వేల వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో హంద్రీనీవా నీళ్లు వదలాలని ఎమ్మెల్సీ కేశవ్‌ ఆదేశించడం దుర్మార్గమన్నారు.  తమ మాట వినడం లేదనే రైతులపై కక్షట్టి పయ్యావుల కేశవ్‌ చేతికొచ్చిన పంటలను నీటిపాలు చేశారన్నారు. నీరువదులుతున్నట్లు తెలిసి తాను వారం క్రితమే ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి రోజులు నీటి సరఫరా నిలపాలని కోరానన్నారు. కానీ కేశవ్‌ అధికారులు, పోలీసులపై తీవ్ర  ఒత్తిడి చేసి  రైతులను దెబ్బతీయాలన్న కుట్రతో చెరువుకు నీళ్లు వదిలించారన్నారు. అధికారులు  ఇప్పటికైనా నీటి సరఫరా ఆపితే కనీసం 50 ఎకరాల్లోని పంట అయినా రైతులకు దక్కే అవకాశం ఉందన్నారు. లేని పక్షంలో రైతులతో కలిసి అధికారులపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు.

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్య, వైఎస్సార్‌ సీపీ పట్టణ కన్వీనర్‌ తేజోనాథ్, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, ప్రధాన కార్యదర్శి ఈడిగ ప్రసాద్, కిసాన్‌ సెల్‌ నాయకుడు కాకర్ల నాగేశ్వరావు, మాన్యం ప్రకాష్, దుద్దేకుంట రామాంజినేయులు,  మూలగిరిపల్లి ఓబన్న, గోవిందు, ఆంజినేయులు, రాయంపల్లి ఎర్రిస్వామిరెడ్డి, విడపనకల్లు మండల కన్వీనర్‌ బసన్న, గడేకల్లు పంపాపతి పాల్గొన్నారు.

Back to Top