మిర్చి ధర ఒక్కసారిగా పెరిగింది. మునుపెన్నడూ లేనివిధంగా క్వింటాలు మిర్చి రూ.11,800కు పరుగుతీసింది.
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: మిర్చి ధర ఒక్కసారిగా పెరిగింది. మునుపెన్నడూ లేనివిధంగా క్వింటాలు మిర్చి రూ.11,800కు పరుగుతీసింది. పంటసాగు తగ్గడం, వేసిన కొద్దిపాటి పంట కూడా తుపానులు, అధిక వర్షాలకు దెబ్బతినడంతో మిర్చికి డిమాండ్ పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ప్రధానంగా మిరప పంటను మధ్యప్రదేశ్‌లో ఎక్కువ సాగుచేస్తారు. ఈ ఏడాది వివిధ కారణాలతో ఆ రాష్ట్రంలో పంట దెబ్బతిన్నది. మధ్యప్రదేశ్ అధికంగా సాగుచేసే 12 నంబర్ రకం కన్నా మన రాష్ట్రంలో పండించే తేజా రకానికి విదేశాల్లో ఆదరణ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో తేజా రకం మిర్చినే ఎక్కువగా పండిస్తున్నారు. పది రోజులుగా కొత్త మిర్చి మార్కెట్‌కు అమ్మకానికి వస్తుంది. ఈ మిర్చి ధర రూ. 7 వేల నుంచి రూ.9 వేల వరకు పలుకుతుంది.
ఇదే ధర కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చికి కూడా పలుకుతుంది. అయితే గురువారం ఒక్కసారిగా క్వింటాలు మిర్చి రూ.11,800 పలకడం గమనార్హం. కొత్త మిర్చి, ఏసీ మిర్చి ధర ఇంత అధికంగా ఎప్పుడూ లేదని వ్యాపారులు చెబుతున్నారు. మిర్చి ధర 1999, 2011 సంవత్సరాల్లో రూ.10 వేలుగా ఉండేదని ఆ ధరను మించి ప్రస్తుతం రూ.11,800కు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది మిర్చి క్వింటాలు రూ.3,500 నుంచి రూ.6,000 మధ్య ధర పలికింది. ఈ ధరతో వ్యాపారులు సరుకును కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. కొందరు రైతులు ఆ ధరకు సరుకును విక్రయించటం ఇష్టం లేక వారుకూడా కోల్డ్ స్టోరేజీల్లోనే ఉంచారు. గత ఆగస్టు నెల వరకు కూడా మిర్చి ధర పెరగలేదు. ఇక లాభం లేదని కొందరు రైతులు వ్యవసాయపెట్టుబడుల కోసం, వ్యాపారులు పంట ఉత్పత్తుల కొనుగోలు కోసం స్టోరేజీల్లో నిల్వ ఉంచిన సరుకును అమ్మడం ప్రారంభించారు. నవంబర్ నెల వరకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన సరుకును రూ.5,500 నుంచి రూ.6,000 మధ్యే అమ్మారు. జిల్లాలో ఉన్న కోల్డ్ స్టోరేజీల్లో ప్రస్తుతం అంతగా సరుకు లేదు. జిల్లాలో మొత్తం 20 కోల్డ్ స్టోరేజీల వరకు ఉన్నాయి. ఒక్కో కోల్డ్ స్టోరేజీ కెపాసిటీ దాదాపు లక్ష బస్తాల వరకు ఉంది.
గత ఏడాది డిమాండ్ లేక ధర తక్కువగా ఉండటంతో అన్ని కోల్డ్ స్టోరేజీలను వ్యాపారులు, రైతులు సరుకుతో నింపారు. ధర ఆశాజనకంగా పెరగకపోవటంతో నిల్వ ఉంచిన సరుకులో అధిక భాగం ఆగస్టు నుంచి నవంబర్ నెలల మధ్య అధిక భాగం విక్రయించారు. ప్రస్తుతం ఉన్న సరుకుకు మాత్రం బాగా డిమాండ్ ఏర్పడింది. మలేషియా, సింగపూర్, పాకిస్థాన్, చైనా తదితర దేశాల్లో మిర్చికి బాగా డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన సరుకును చెన్నై, ముంబైలకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని అంటున్నారు. గత ఏడాది క్వింటాలు రూ.3,500 నుంచి రూ.6,000కు కొనుగోలు చేసి ఇప్పటి వరకు సరుకు నిల్వ ఉంచిన వ్యాపారులకు క్వింటాలుకు రూ. 6వేల నుంచి 8వేల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది.
తాలు తళతళ..
నాణ్యమైన మిర్చితో పాటు తాలు మిర్చి ధర కూడా ఊహించని రీతిలో పెరిగింది. ఇప్పటి వరకు క్వింటాలు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే ఉన్న తాలు మిర్చి ధర ఏకంగా రూ.4,400కు చేరింది. గురువారం తాలు మిర్చి గరిష్ఠ ధర రూ.4,400 పలుకగా, కనిష్ట ధర రూ.4,200 పలికింది. తాలు మిర్చి నిల్వ ఉంచిన రైతులు, వ్యాపారులకు కూడా ఈ ధరతో కలిసొస్తుంది. ఈ ఏడాది జిల్లాలో సుమారు 19 వేల హెక్టార్లలో మిర్చి సాగు చేసినప్పటికీ, అక్టోబర్ నెల చివరి వారంలో కురిసిన వర్షాలతో పంట అధికంగా దెబ్బతిన్నది. కొన్ని తోటలు ఊటబట్టి పోవటంతో ఆ తోటలను తొలగించి ఇతర పంటలు వేశారు. పలు ప్రాంతాల్లో మెరక నేలల్లో వేసిన పైర్లు మాత్రం కొంత మేరకు ఆశాజనకంగా ఉన్నాయి. అయినా పంట దిగుబడులు ఆశించిన మేర ఉండవని రైతులు చెబుతున్నారు.