నా కొడుకు అయినా సరే కోచింగ్‌ తీసుకోవాల్సిందే

Minister Perni Nani Launches Safety Driving Education Center In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్‌ నియమ నిబంధనలపై అందరూ అవగాహన పెంచుకోవాలని రవాణ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం ఆయన విజయవాడలో రవాణ శాఖ, హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేఫ్టి డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రవాణా శాఖ కమిషనర్‌ సీతారామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... సేఫ్టి డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో ప్రతి రోజు సురక్షిత ప్రయాణం ఎలా అనే అంశంపై శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. రోజుకి వంద మందికి శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ క్లాసులన్ని ఉచితంగా అందిస్తామని, అందరూ సద్వినియోగం​ చేసుకోవాలని కోరారు. ట్రైనింగ్‌ తీసుకోకుండా ఎవరికి ఎల్‌ఎల్‌ఆర్‌(లర్నింగ్‌ లైసెన్స్‌) ఇవ్వటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. చివరకు తన కొడుకు అయినా సరే కోచింగ్‌ తీసుకున్న తర్వాత మాత్రమే ఎల్‌ఎల్‌ఆర్‌ తీసుకోవాలని స్పష్టం చేశారు.

 ప్రభుత్వం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంది : ఎమ్మెల్యే  మల్లాది
ప్రమాదాలు నివారించడానికి, ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువస్తున్న సంస్కరణ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అందరూ ట్రాఫిక్‌ నియమాలను పాటించాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top