పరాభవాల పరంపర
ఎన్నో ఆశలతో టీడీపీలోకి వెళ్లిన చాంద్‌బాషాకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
	► కదిరి ఎమ్మెల్యేను స్వాగతించలేకపోతున్న టీడీపీ శ్రేణులు
	► మినీ మహానాడుకు ముఖం చాటేసిన చాంద్‌బాషా
	► హాజరైతే భౌతికదాడులకు సిద్ధమైన కందికుంట అనుచరులు
	 
	(సాక్షిప్రతినిధి, అనంతపురం) ఎన్నో ఆశలతో టీడీపీలోకి వెళ్లిన చాంద్‌బాషాకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పార్టీ అధిష్టానం ఇప్పటికే అత్తార్ అధికారాలకు కత్తెర పెడితే.. జిల్లా నేతలు కూడా చేరదీయడం లేదు. ఇటీవల టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పరాభవాన్ని మరవకముందే.. అత్తార్‌కు మరో ఎదురుదెబ్బ తగలింది. కదిరిలో బుధవారం జరిగిన మినీమహానాడుకు హాజరుకాలేదు. కందికుంట వర్గం బెదిరింపుల నేపథ్యంలో తిరుపతికి పారిపోయినట్లు తెలుస్తోంది.
	
	
	బుధవారం కదిరిలోని ఓ ఫంక్షన్ హాలులో టీడీపీ మినీ మహానాడును నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంటప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఎమ్మెల్యే చాంద్‌బాషా మాత్రం గైర్హాజరయ్యారు. దీనిపై జిల్లాలో తీవ్ర చర్చ సాగుతోంది. మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించి మినీమహానాడులో తీర్మానాలు చేస్తారు. వీటిని మహానాడులో నివేదిస్తారు. నియోజకవర్గస్థాయిలో ఇంతకంటే ప్రాధాన్యత ఉన్న కార్యక్రమం టీడీపీకి మరొకటి లేదు. దీన్ని వాస్తవానికి ఎమ్మెల్యే  ఆధ్వర్యంలో నిర్వహించాలి. కానీ కందికుంట.. చాంద్‌బాషాను బైపాస్ చేసి మహానాడును నిర్వహించారు. చాంద్‌బాషా హాజరైతే అవమానించి పంపాలని, అవసరమైతే భౌతికదాడి చేయాలని కందికుంట వర్గం భావించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫంక్షన్‌హాలు బయట కొంతమంది పాగావేసినట్లు గ్రహించిన చాంద్‌బాషా తిరుపతికి పారిపోయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే గైర్హాజరుతో ఆయన అనుచరులు కూడా అటువైపు చూడలేదు.
	
	
	 విస్తృతస్థాయి సమావేశంలోనూ అవమానమే
	 ఈ నెల 3న ‘అనంత’లో నిర్వహించిన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి చాంద్‌బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు చాంద్‌బాషా వైఖరిపై పరోక్షంగా చురకలంటించారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ‘పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఒక్క కార్యకర్త పార్టీ వీడలేదు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రెండేళ్లు కూడా ఉండలేకపోతున్నారు’ అని పరోక్షంగా చాంద్ కు చురకలంటించారు. కేశవ్ ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆయన మొహం చిన్నబోయింది. సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తల కళ్లన్నీ చాంద్‌బాషా వైపు చూశాయి. తర్వాత కందికుంట  మాట్లాడుతూ ‘ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశానికి వచ్చి నేను మాట్లాడుతున్నా. ఇటీవల జరిగిన ఘటన వ్యక్తిగతంగా నొప్పి కల్గించింది. తప్పనిపరిస్థితుల్లో పార్టీ అధినేత కోసం స్వాగతించాం’ అని నేరుగా ఎమ్మెల్యేనుద్దేశించి అన్నారు. సమావేశానికి వచ్చిన ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా  చాంద్‌తో అంటీముట్టనట్లు వ్యవహరించారు.
	 
	 అధికారాలకూ కత్తెర
	చాంద్‌బాషాకు కదిరి నియోజకవర్గంపై ఎలాంటి పెత్తనమూ లేకుండా చేయడంలో టీడీపీ నేతలు సఫలీకృతులయ్యారు.  అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాలకు లబ్ధిదారుల ఎంపికలోనూ ఎమ్మెల్యే సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదని, కందికుంటకే ప్రాధాన్యతివ్వాలని జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి కామినేని శ్రీనివాస్ గతంలోనే జిల్లా అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. మంగళవారం మరోసారి ఇదే విషయాన్ని పునురుద్ఘాటించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ పరిణామాలతో ‘అనుకున్నది ఒకటైతే...అయ్యేది మరోలా ఉందని’ చాంద్‌బాషా డీలాపడుతున్నారు. టీడీపీలోకి వచ్చి పెద్ద తప్పు చేశానని తన అనుచరులతో వాపోతున్నట్లు అత్తార్ సన్నిహితులు ‘సాక్షి’తో చెప్పారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
