మావోల చేతిలో మాజీ ఎస్పీఓ హత్య | Maoists in the murder of former spo | Sakshi
Sakshi News home page

మావోల చేతిలో మాజీ ఎస్పీఓ హత్య

Jan 16 2014 5:59 AM | Updated on Jul 12 2019 6:01 PM

ఆంధ్ర-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు మళ్లీ కలకలం రేపారు.

 భద్రాచలం, న్యూస్‌లైన్: ఆంధ్ర-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు మళ్లీ కలకలం రేపారు.  దుమ్ముగూడెం మండలం  కొత్తపల్లి పంచాయతీలో గల బట్టిగుంపు వద్ద బుధవారం మాజీ ఎస్పీఓను దారుణంగా కత్తులతో పొడిచి చంపిన ఘటనతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. కోడిపందేలు నిర్వహించే ప్రదేశానికి సాధారణ ప్రజల్లా వచ్చిన మావోయిస్టు మిలీషియా సభ్యులు పందేలు చూస్తున్న  మడివి సోమయ్య(36) అనే మాజీ ఎస్పీఓపై దాడి చేసి హత మార్చారు. గతంలో సల్వాజుడుం సభ్యుడిగా పనిచేసిన సోమయ్య ప్రస్తుతం  ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా మారాయిగూడెం పోలీసు స్టేషన్‌లో  సహాయ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఈ సంఘటనతో మన జిల్లాతో పాటు ఛత్తీస్‌గఢ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
 
 గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులపై పోలీసులే పై చేయి సాధించారు. సరిగ్గా ఏడాది క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని పూవర్తి వద్ద జరిగిన  ఎన్‌కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు. కెకేడబ్ల్యూ దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటం ఒక రకంగా పోలీసులు సాధించిన విజయంగానే చెప్పాలి. గత ఏడాది అక్టోబర్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బడేచల్మ వద్ద జరిగిన మరో ఎన్ కౌంటర్‌లో శబరి దళ కార్యదర్శి నరేష్‌తో పాటు మరో దళ సభ్యుడు తెల్లం రాములు మృతి చెందాడు. దీంతో దాదాపు శబరి దళం కూడా కనుమరుగైపోయినట్లుగా పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో మన రాష్ట్రం పరిధిలో వెంకటాపురం ఏరియా కమిటీనే పనిచేస్తున్నట్లుగా భావిస్తున్న  పోలీసులు మరో అడుగు ముందుకేసి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. దీనికి నిరసనగా మావోయిస్టులు అడపా దడపా చిన్న పాటి సంఘటనలకు పాల్పడుతూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూనే  ఉన్నారు.
 
 రిక్రూట్‌మెంట్లపై ప్రత్యేక దృష్టి :    పూవర్తి ఎన్‌కౌంటర్ తరువాత ఛత్తీస్‌గఢ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన మావోయిస్టులు మన రాష్ట్రానికి ఆనుకొని ఉన్న సరిహద్దు అటవీప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూవర్తి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా వెంకటాపురం మండలం సూరవీడు కాలనీ వద్ద గత ఏడాది జూన్ నెలలో ఓ వ్యక్తిని హత్య చేసి పడేశారు. గతేడాది అక్టోబర్‌లో భద్రాచలం మండలం గొల్లగుప్పకు చెందిన మడకం కోసాను హత్య చేసి చింతూరు మండలం కాటుకపల్లి వద్ద రహదారిపై పడేశారు. ఉనికిని చాటుకునే క్రమంలోనే ఈ ఘటనకు పాల్పడిన మావోయిస్టులు దళాన్ని పెంచుకునేందుకు భారీగానే రిక్రూట్‌మెంట్లును చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిఘా వర్గాలు సైతం దీన్ని అవుననే అంటున్నాయి. పోలీసులు కనుమరుగైపోయిందనుకున్న శబరి దళాన్ని బలోపేతం చేసేందుకు కొత్తగా సంతూకు బాధ్యతలు అప్పగించినట్లుగా విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా సరిహద్దు గ్రామాల్లో సాధారణ గిరిజనుల మాదిరే తిరుగుతున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున యువకులను ఉద్యమంలోకి తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో  గ్రామాల్లో తమకు అనుకూలంగా సానుభూతి పరుల మద్దతును కూడగట్టుకుంటున్నట్లుగా ఇంటిలిజెన్స్ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి.
 
 సరిహద్దు గ్రామాల్లో భయాందోళన :
  చాపకింద నీరులా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు అదును చూసి దాడులకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారనే నిఘా వర్గాల హెచ్చరికలతో వీరిని ఎదుర్కొనేందుకు  పోలీసులు సైతం ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల మధ్య ఎక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement