ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మదనపల్లి (చిత్తూరు) : ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుట్టపై నుంచి మూడు కిలోమీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూకి ఆత్మహత్యాయాత్నం చేసిన వ్యక్తి అదృష్టవశాత్తు చెట్లలో చిక్కుకొని బతికిపోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం హార్స్ లీ హిల్స్‌లోని కాలిబండ వద్ద సోమవారం చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఎం.టి.భగీరధ రెడ్డి(48) సిరికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉన్నతాధికారులతో విబేధించిన కారణంగా వారు ఇతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగక పలుమార్లు భౌతిక దాడులకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన భగీరధ రెడ్డి ఆత్మాహత్య చేసుకోవడానికి హార్స్ లీ హిల్స్‌లోని కాలిబండ పక్కన ఉన్న కొండపైకి చేరుకున్నాడు.
అనంతరం తన తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడి నుంచి దూకేశాడు. ఒంటిపై వేసుకుని ఉన్న జర్కిన్ చెట్లలో చిక్కుకోవడంతో.. సుమారు 3000 అడుగుల ఎత్తులో కొండపై ఇరుక్కున్నాడు. అప్పటికే అతని తమ్ముడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని రక్షించారు. చెట్టు కొమ్మలు గీరుకోవడంతో.. శరీరమంతా గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.