బెడిసిన వివాహేతర సంబంధం | Lover murder by girlfriend In Prakasam district | Sakshi
Sakshi News home page

బెడిసిన వివాహేతర సంబంధం

Jul 1 2018 8:05 AM | Updated on Jul 30 2018 8:41 PM

Lover murder by girlfriend In Prakasam district  - Sakshi

15 ఏళ్లకుపైగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం బెడిసి ప్రియుడిని ప్రియురాలు హత్య చేసింది.

ప్రకాశం జిల్లా / వేటపాలెం: 15 ఏళ్లకుపైగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం బెడిసి ప్రియుడిని ప్రియురాలు హత్య చేసింది. ఈ సంఘటన మండలంలోని దేశాయిపేట పంచాయతీ రామానగర్‌ సమీపంలో విజయ్‌నగర్‌ కాలనీ ఎస్సీ బాలుర హాస్టల్‌ వద్ద శనివారం ఉదయం వెలుగు చూసింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దేశాయిపేట పంచాయతీ శాంతినగర్‌కు చెందిన పింజల బాల చంద్రశేఖరరావు (39)కు రామానగర్‌కు చెందిన ఓ మహిళ(45)తో అతడి వివాహానికి ముందు నుంచే వివాహేతర సంబంధం కొనసాగుతోంది.

 చంద్రశేఖర్‌రావుకు పందిళ్లపల్లికి చెందిన రేవతితో 15 ఏళ్ల క్రితం వివాహమై 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహేతర సంబంధం కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగలేదు. దంపతుల మధ్య గొడవ కారణంగా ఏడాది క్రితం రేవతి పుట్టింటికి వెళ్లింది. చంద్రశేఖర్‌రావు గుంటూరులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ రెండు మూడు నెలలకోసారి స్వగ్రామానికి వచ్చేవాడు. ఆ సమయంలో ప్రియురాలి వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. తండ్రి సంవత్సరీకానికి మూడు రోజుల క్రితం వచ్చి ప్రియురాలి వద్దకు వెళ్లాడు. వివాహేతర సంబంధం ఇక వద్దని ఆమె వారించింది. అయినా వినక పోవడంతో చంద్రశేఖర్‌ అన్న సుబ్బారాయుడితో మాట్లాడింది. మీ తమ్ముడు తరుచూ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడని చెప్పడంతో ఆయన సర్ది చెప్పి ఆమెను పంపించాడు. 

రాత్రి 12 గంటల ప్రాంతంలో చంద్రశేఖర్‌ మళ్లీ ఆమె ఇంటికి వెళ్లాడు. శనివారం తెల్లవారు జామున హాస్టల్‌ పక్కనే రోడ్డుపై అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళ ఇంట్లో, చీరపై రక్తపు మరకలు గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి చివరకు హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా..అని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 సంఘటన  స్థలాన్ని చీరాల డీఎస్పీ వి.శ్రీనివాసరావు, సీఐలు పి.భక్తవత్సలరెడ్డి, సత్యనారాయణ, రామారావులు పరిశీలించారు. ఒంగోలు నుంచి డాగ్‌ స్క్వాడ్‌ వచ్చి నేరుగా అనుమానితురాలి ఇల్లు, వెనుక వైపు కలియ తిరిగింది. మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం చేయించారు. మృతుడి భార్య, కుమారుడు సంఘటన స్థలానికి చేరుకుని భోరున విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement