
సమస్యలను కలెక్టర్ సత్యనారాయణకు తెలుపుతున్న కాలనీవాసులు, (ఇన్‌సెట్‌లో) మోడల్ స్కూల్‌లో చంపేసిన తేలు
కర్నూలు ,సి.బెళగల్: ‘పల్లెలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పట్టించుకోకపోతే మీరెందుకు. ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని’ కలెక్టర్ సత్యనారాయణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెనిద్రలో భాగంగా మంగళవారం రాత్రి సి. బెళగల్‌లో బస చేసిన ఆయన బుధవారం ఉదయం గ్రామంలోని ఎస్సీకాలనీలో పర్యటించారు. తాగేందుకు నీళ్లు, మురుగుకాలువలు, సీసీ రోడ్లు లేవని కొందరు, పింఛన్, గృహా సంబంధ సమస్యలను మరి కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థానిక అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తర్వాత మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై మీరు గ్రామాల్లో ఏం పనులు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇంకోసారి సమస్యలపై ఫిర్యాదులు వస్తే సహించనని హెచ్చరించారు.
కలెక్టర్ పల్లెనిద్రలో తేలు ప్రత్యక్షం
మంగళవారం రాత్రి 10–30 గంటలకు సి.బెళగల్‌కు చేరుకున్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్థానిక ఎస్సీ హాస్టల్‌లో ఎస్సీ, బీసీ హాస్టళ్ల విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఊరి చివరనున్న మోడల్ స్కూల్‌లో కలెక్టర్ నిద్రపోయారు. ఆసమయంలో తేలు ప్రత్యక్షమవడంతో అధికారులు కలవరపడ్డారు. వెంటనే చంపేసి ఊపిరి పీల్చుకున్నారు. ఆయా శాఖల అధికారులు వారివారి కార్యాలయాల్లో నిద్రించగా నోడల్ అధికారి ప్రసాదరావు ఎస్సీ హాస్టల్‌లో బస చేశారు. కలెక్టర్ గ్రామ పర్యటనలో డిప్యూటీ కలెక్టర్ మల్లిఖార్జున, డీడీ ప్రసాదరావు, డీఎంహెచ్‌ఓ నరసింహులు, తహసీల్దార్ అన్వర్‌హుసేన్, సంక్షేమ, మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.