కుప్పంలో విమానం ఎగిరేనా..?

Kuppam Airport Considerations Nill In Chittoor - Sakshi

నాలుగేళ్లుగా ప్రతిపాదనలు దాటని పనులు

ఎయిర్‌పోర్టుకు         అనుమతులు నిల్‌

మాట నిలుపుకోని బాబు సర్కారు

ఎయిర్‌ స్ట్రిప్‌ పేరుతో మరో కొత్త నాటకం

కుప్పం ప్రజల ఎయిర్‌పోర్టు కల ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. నాలుగేళ్ల పాటు సాక్షాత్తూ తెలుగుదేశం ఎంపీ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా.. ఎయిర్‌పోర్టు అనుమతులను టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అన్ని హామీల్లాగే.. ఎయిర్‌పోర్టు హామీ కూడా గాలిలో కలిసిపోయిందని కుప్పం వాసులు చంద్రబాబు తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శాంతిపురం: కుప్పంలో విమానాశ్రయ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఆధునిక హంగులతో ఎయిర్‌పోర్ట్, గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, కార్గో ఎయిర్‌పోర్టు అని ఎప్పటికప్పుడు అనేక ఊహాగానాలు సాగినా.. వీటిలో దేనికీ అనుమతులు సాధించటంలో బాబు సర్కారు సఫలం కాలేకపోయింది. చివరకు కుప్పం ప్రజలకు కంటి తుడుపుగా ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మాణం పేరుతో కొత్త ప్రచారాన్ని తెరమీదికి తెచ్చింది.

సా...గుతోంది ఇలా
2015 జనవరిలో కుప్పం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం తెరమీదికి తెచ్చింది. దీంతో తమ ప్రాంతంలోనూ విమానాశ్రయం వస్తుందని స్థానికులు సంబరపడ్డారు. రామకుప్పం–శాంతిపురం మండల సరిహద్దుల్లోని అమ్మవారిపేట, సొన్నేగానిపల్లి, కిలాకిపోడు, విజలాపురం రెవెన్యూ గ్రామాల పరిధిలోని 1,249 ఎకరాల్లో దీనిని నిర్మిస్తామని అధికార యంత్రాంగం ప్రకటించింది. దీనిపై స్థానికంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం, ఏవియేషన్‌ నిపుణుల అభ్యంతరాలతో అదే ఎడాది ఆగస్టులో శాంతిపురం మండలంలోని కడపల్లి, పోడుచేన్లు, మొరసనపల్లి, కదిరిఓబనపల్లి ప్రాంతాల్లో సర్వేలకు దిగారు. కానీ అక్కడా రైతులు ససేమిరా అన్నారు. కనీసం అధికారులను తమ పొలాల్లోకి కూడా కాలుమోపనివ్వలేదు.  వంకలు, గుట్టలు ఉన్న ఈ భూములు విమానాశ్రయానికి అసలు పనికిరావని నాటి జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో గుడుపల్లి మండలంలోని పొగురుపల్లి వద్ద భూములు అనుకున్నా అవి కుదరలేదు. కొంతకాలం మరుగున పడిన ఈ అంశం 2017లో మళ్లీ తెరమీదికి వచ్చింది. మళ్లీ అధికారులు శాంతిపురం–రామకుప్పం సరిహద్దుల్లో సర్వేలకు పూనుకున్నారు. రైతులు అడ్డుకోవటంతో సాగు నమోదు పేరుతో అధికారులు తతంగం పూర్తి చేశారు. గతంలో అనుకున్న భూములలో విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతికంగా ఇబ్బందులు ఉండటంతో కొత్త ప్రణాళికలు ముందుకు తెచ్చారు.

ఎట్టకేలకు గుర్తించినవి..
రామకుప్పం–శాంతిపురం మండలాల సరిహద్దుల్లోని 543.97 ఎకరాలను ప్రభుత్వం విమానాశ్రయానికి ఎంచుకుంది. రామకుప్పం మండలంలోని కిలాకిపోడు, మణీంద్రం, కడిసెనకుప్పం రెవెన్యూలోని 491 ఎకరాలు, పక్కనే ఉన్న అమ్మవారిపేట రెవెన్యూలో 43.51 ఎకరాలు, సొన్నేగానిపల్లి రెవెన్యూలో 9.43 ఎకరాలను ఎంపి క చేశారు. రామకుప్పం పరిధిలోని భూముల్లో కృష్ణరాజపురం ఉండటంతో మళ్లీ కొంత మార్పులు చేసి పశ్చిమానికి ప్లానును మార్చారు. ఈ మేరకు రైతులు విమానాశ్రయ భూ సేకరణ నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. తాజాగా 450 ఎకరాల్లో ఎయిర్‌ స్ట్రిప్‌ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.

సర్కారు వైఫల్యం..
ఆది నుంచి కుప్పం ఎయిర్‌పోర్టుపై ప్రచారానికి పెద్దపీట వేసి, కన్సెల్టెన్సీలు, ఎక్స్‌పర్టుల పేరుతో ప్రజాధనం దుబారా చేసిన రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన అనుమతులు మాత్రం పొందలేక పోయింది. నాలుగేళ్లకు పైగా టీడీపీ కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా, ఆ పార్టీకి చెందిన అశోక్‌గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగినా కనీసం అనుమతులు సాధించలేక పోయారు. రక్షణశాఖ, బెంగళూరు ఎయిర్‌ పోర్టు అధారిటీ అభ్యంతరాలను కూడా నివృత్తి చేయలేకపోయారు. దీంతో కుప్పంలో విమానాశ్రయ నిర్మాణంపై ప్రభుత్వ పెద్దల చిత్తశుద్ధిని శంకించే పరిస్థితి వచ్చింది.

ఎయిర్‌స్ట్రిప్‌తో ఒరిగేదేమిటో ?:
ఎయిర్‌పోర్టుకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఎయిర్‌స్ట్రిప్‌తో కుప్పం ప్రజలకు కలిగే మేలు ఏమిటో పాలకులకే ఎరుక. కుప్పం జనం ఆశలపై నీళ్లు చల్లిన ఎయిర్‌ స్ట్రిప్‌ ద్వారా కేవలం ప్రభుత్వ, చార్టెడ్‌ విమానాలు మాత్రమే సంచరించే వీలుంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతికి, ప్రజా ప్రయాణానికి, సరుకుల రవాణాకు ఉపయోగపడదు. చిన్నపాటి రన్‌వేతో ఒక టెర్మినెల్‌ మాత్రమే నిర్మించి, నామమాత్రంగా విమానాలు వస్తే ఉపాధి పరంగానూ కొత్త అవకాశాలకు ఆస్కారం ఉండదు. కేవలం కుప్పంలో ఎయిర్‌ పోర్టు పేరుతో ఓట్ల వేటకు, గొప్పలు చెప్పుకోవటానికి మాత్రమే ఇది ఉపయోగపడే అవకాశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top