అధిష్టానంపై ఆగ్రహం!

Kotla Surya Prakash Reddy Is Not Happy In Congress Kurnool - Sakshi

సీడబ్ల్యూసీలో కోట్లకు దక్కని స్థానం

కాంగ్రెస్‌ అధిష్టానం తీరుపై ఆయన వర్గీయుల మండిపాటు

అవమానించారంటున్న అభిమానులు

పార్టీని నమ్ముకుంటే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి వర్గీయులు ఆ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారా? కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లో స్థానం కల్పించకపోవడంపై మండిపడుతున్నారా? పార్టీని నమ్ముకుని కృషి చేస్తున్నా.. గుర్తింపు ఇవ్వకపోవడంతో అధిష్టానం వ్యవహారశైలిని తప్పుపడుతున్నారా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ అవమానాలకు గురిచేస్తోందని ఆయన అనుచరులు వాపోతున్నారు.

రాజ్యసభ సీట్ల కేటాయింపు సందర్భంగానూ ఆయన్ను పరిగణనలోకి తీసుకోలేదనే అభిప్రాయం ఉంది. తాజాగా పార్టీలో కేంద్ర బిందువైన సీడబ్ల్యూసీలో కూడా స్థానం కల్పించకపోవడం తమ నేతను అవమానించడమేనని అంటున్నారు. ఆదర్శవంతమైన కుటుంబమని, రెండుసార్లు సీఎంగా చేసిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని గుర్తించడం లేదని కోడుమూరు మండలానికి చెందిన సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోట్లను ఢిల్లీకి ఆ పార్టీ అధిష్టానం పిలిపించినట్టు తెలుస్తోంది.
   
ఎన్ని ఆఫర్లు వచ్చినా... వాస్తవానికి కాంగ్రెస్‌ నుంచి అనేక మంది నేతలు 
పార్టీ మారినప్పటికీ కోట్ల మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అధికార పార్టీ ఆహ్వానించడంతో పాటు భారీ ఆఫర్లను కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఏకంగా సీఎం చంద్రబాబు స్థాయిలో కోట్లను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు కోరినట్టుగా సీట్లు కూడా ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. ఈ ప్రతిపాదనను కోట్ల సున్నితంగా తిరస్కరించారు. ఏకంగా కోట్ల బంధువు ద్వారా హైదరాబాద్‌లో కలిసి మరీ ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌ కూడా కోట్ల కుటుంబంతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

సూర్యప్రకాష్‌రెడ్డి కుమారుడు రాఘవేంద్ర వివాహం సందర్భంగా ఆయన కుటుంబంతో చర్చలు జరిపి.. డోన్, ఆలూరుతో పాటు ఎంపీ స్థానం ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని కోట్లకు హామీ ఇచ్చారనే ప్రచారం ఉంది. అయినప్పటికీ ఆయన టీడీపీలో చేరేదిలేదని కరాఖండిగా తేల్చిచెప్పారు. కాగా.. కోట్లకు తగినంత గుర్తింపు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇవ్వడం లేదన్న అభిప్రాయం ఆయన వర్గీయుల్లో బలంగా ఉంది. రాజ్యసభ సీటు కేటాయిస్తారని ఆశించారు. అది జరగకపోగా.. తాజాగా సీడబ్ల్యూసీలోనూ స్థానం కల్పించకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
అప్పటి నుంచి అదే తీరే! 
నిజానికి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్నప్పటికీ సరైన న్యాయం చేయడం లేదన్న అభిప్రాయం ఆ పార్టీలోనే నెలకొని ఉంది. అనంతపురం జిల్లాకు రాహుల్‌గాంధీ వచ్చిన సందర్భంగానూ కోట్ల కినుక వహించారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో తనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను మాత్రమే అనుమతించి.. ముఖ్య అనుచరులను రానివ్వకపోవడంపై కినుక వహించారు. ఆ కార్యక్రమాన్ని కాస్తా బహిష్కరించి వెనువెంటనే జిల్లాకు తిరిగొచ్చారు.  ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయానికి (కళా వెంకట్రావు భవన్‌) తాళం వేశారు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా వచ్చి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కోట్ల చల్లబడలేదు. ఏకంగా ఏఐసీసీ నుంచి దిగ్విజయ్‌సింగ్‌ వచ్చి మరీ కోట్లకు క్షమాపణలు చెప్పారు. దీంతో వివాదం కాస్తా సద్దుమణిగింది.  తాజాగా సీడబ్ల్యూసీ ప్రకంపనలు ఎటువైపు దారి తీస్తాయోనన్నది వేచిచూడాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top