
కొమ్మూరు వారి భూములు అమ్మేశారు!
రైతులు బతకాలి... తిండిగింజలు పండించి నలుగుర్ని బతి కించాలన్న లక్ష్యంతో ఊపిరి పోసుకున్న ట్రస్ట్ మహోన్నత ఆశయం... అతని అత్యాశ ముందు చిన్నబోయింది.
రైతులు బతకాలి... తిండిగింజలు పండించి నలుగుర్ని బతి కించాలన్న లక్ష్యంతో ఊపిరి పోసుకున్న ట్రస్ట్ మహోన్నత ఆశయం... అతని అత్యాశ ముందు చిన్నబోయింది. అతని స్వలాభాపేక్షతో... ఆ సంస్థ సంకల్పం వికల్పమైంది.. కంచే చేను మేయడంతో కొమ్మూరు అప్పడుదొర ట్రస్టుకు చెందిన ఐదున్నర ఎకరాలు అక్రమంగా పరులపాలైంది. కంటికి రెప్పలా ట్రస్ట్ ఆస్తులను కాపాడాల్సిన ప్రతినిధే విలువైన స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేశారు. ఇప్పుడా భూమి విలువ రూ.5 కోట్లు పైమాటే....
భోగాపురం :జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, భోగాపురానికి చెందిన దివంగత కొమ్మూరు అప్పడుదొర సజీవంగా ఉన్న కాలంలో పాతికేళ్ల క్రితం పేదలకు చేయూత అందించాలనే సంకల్పంతో తన పేరు మీద ఓ ట్రస్టును ఏర్పాటుచేశారు. అప్పట్లో గూడెపువలస రెవెన్యూ పరిధిలో సర్వే నం. 5/4లో తన సొంత స్థలమైన 22 ఎకరాల 81 సెంట్లను ట్రస్టుకు రాసిచ్చారు. ఆ స్థలంలో ఎటువంటి క్రయ విక్రయాలు జరుపకుండా రైతులు పంటలు పండించుకుంటూ జీవనోపాధి పొందాలనేది కొమ్మూరు ఆశయం. అందుకే తమ కుటుంబంతో ఎలాంటి సంబంధంలేని ఒక వ్యక్తిని ట్రస్టు చైర్మన్‌గా నియమించారు. భవిష్యత్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ట్రస్టుకే అప్పగించారు.
అయితే ‘కంచె చేను మేసినట్లు’గా ట్రస్టు చైర్మన్‌గా నియమితులైన వ్యక్తే స్వయంగా సదరు భూముల్లోని సుమారు ఐదున్నర ఎకరాలను పరులకు విక్రయించేశాడు. ప్రస్తుతం విక్రయించిన భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చి సదరు కొనుగోలుదారులు ప్లాట్లు వేసేశారు. అయితే ఈ విషయంలో ఆలస్యంగా కళ్లు తెరచిన ప్రభుత్వం మూడేళ్ల క్రితం విచారణ ప్రారంభించింది. అంతే గాకుండా ట్రస్టును దేవాదాయ శాఖకు అప్పగించింది. ప్రస్తుతం ఈ భూములు దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్నాయి. రామతీర్థం దేవస్థానానికి చెందిన సహాయక కమిషనర్ ట్రస్టు బాధ్యతలు చేపట్టారు. గతంలో ట్రస్టు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అక్రమంగా విక్రయించిన భూములను తిరిగి స్వాధీనం చేసేందుకు గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ట్రస్టుకి చెందిన భూముల్లో దేవాదాయశాఖ తమ బోర్డులను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విక్రయాలకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సదరు అధికారులు నిర్ణయించారు. అంతేగాకుండా ట్రస్టుకు చెందిన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయరాదని అభ్యర్థిస్తూ స్థానిక రిజిస్ట్రారు కార్యాలయానికి సంబంధిత అధికారులు వినతిపత్రం అందజేశారు. ఎలాగైనా విక్రయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సదరు అధికారులు దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే ట్రస్టుకు చెందిన మిగిలిన భూములను సైతం పూర్తి స్థాయిలో కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు.
చేతులు మారడం వాస్తవమే...
నెల్లిమర్ల మండలం రామతీర్థాలు దేవస్థానం ఈఓ బాబూరావుని ఫోనులో వివరణ కోరగా... భోగాపురం మండలం గుడెపువలసలో ఎండోమెంటుకి అప్పజెప్పిన కొమ్మూరు అప్పడు దొర ట్రస్టు భూముల్లో కొంత భూమి చేతులుమారిన విషయం వాస్తవమేనన్నారు. సదరు భూమిని ఇటీవల పరిశీలించినట్టు చెప్పారు. అమ్మకాలు జరిగిన స్థలంలో ప్లాట్లు వేసి ఉండడాన్ని గమనించామన్నారు. మిగిలిన భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడుతున్నామని, అలాగే చేతులు మారిన ట్రస్టు భూమిపై ఎండోమెంటు ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశామని చెప్పారు. ఆక్రమణ భూములపై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు.