ఆదర్శ మున్సిపాలిటీలో అక్రమాలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్‌..!

Kethireddy Peddareddy Fires On Tadipatri Municipality Irregularities - Sakshi

లీజు, అద్దె బకాయిలు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి ఇవ్వడమేంటి? 

నవంబర్‌ మొదటి వారంలోపు బకాయిలు చెల్లించాలని లీజుదారులకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆదేశం  

సాక్షి, తాడిపత్రి: ‘పేరుకే తాడిపత్రి ఆదర్శ మున్సిపాలిటీ. జరిగేదంతా దోపిడీ, అక్రమాలే. షాపింగ్‌ కాంప్లెక్స్‌ లీజు, అద్దె బకాయిలు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు స్వాహా చేయడమేంటి?’ అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. మున్సిపల్‌ అధికారుల తీరుపైనా అసహనం ప్రదర్శించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ యజమానులు, లీజుదారులతో శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఖాముఖి నిర్వహించారు. మున్సిపాలిటీకి గుడ్‌విల్, అద్దెల రూపంలో చెల్లించిన లక్షలాది రూపాయల్లో సగానికే రసీదులు ఇచ్చి.. మిగతా సొమ్మును సంస్థకు జమ చేయకుండా స్వాహా చేశారని తేలింది. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి శీనాకు అద్దె మొత్తాలు ఇస్తే తమకు రసీదులు కూడా ఇవ్వలేదని పలువురు వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
 
► షాప్‌ అద్దెకు సంబంధించి రూ.13 లక్షలను క్యాషియర్‌ రాజేష్‌కు చెల్లిస్తే రూ.8.50 లక్షలకు మాత్రమే రసీదు ఇచ్చాడని జి.రవీంద్రారెడ్డి తెలిపాడు.  
► గుడ్‌విల్‌ కింద తనవద్ద నుంచి రూ.11లక్షలు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి శీనా తీసుకుని, రూ.8.50 లక్షలకు మాత్రమే రసీదు ఇచ్చాడని, మిగతా మొత్తం గురించి అడిగితే పెన్నానది ఒడ్డున ఏర్పాటు చేసే పార్కు అభివృద్ధి కోసం వినియోగించుకుంటామని చెప్పాడని రంగస్వామి చెప్పాడు.  
► పార్కు నిర్మిస్తున్నామంటే మున్సిపాలిటీకి రూ.11లక్షలు చెల్లించానని, అయితే తనకు రూ.8.50 లక్షలు మాత్రమే షాపు అద్దె చెల్లించినట్లుగా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రసీదు ఇచ్చారని, ఇదేమిటని ప్రశ్నిస్తే అన్న(మాజీ ఎమ్మెల్యే జేసీపీఆర్‌)ను వచ్చి అడగాలని చెప్పడంతో చేసేదిలేక మిన్నకుండిపోయామని ఖాజామొహిద్దీన్‌ ఆరోపించాడు. 
మున్సిపాలిటికీ చెల్లించాల్సిన అద్దె, లీజు, గుడ్‌విల్‌ మొత్తాన్ని నవంబర్‌ మొదటి వారం లోపు చెల్లించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. చెల్లించలేని పక్షంలో వెంటనే షాపులను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. 

వేలం డబ్బు చెల్లించకనే షాపులు ఎలా కేటాయిస్తారు? 
వేలంలో షాపులు దక్కించుకున్న వారి నుంచి డబ్బు వసూలు చేయకుండానే షాపులు కేటాయించడమేంటని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీ రోడ్డులో జేసీఎన్‌ఆర్‌ఎం కాంప్లెక్స్‌లో జేసీ దివాకర్‌ పేరుతో ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నారు. వేలం పాటలో షాపు దక్కించుకున్నారు. వేలం మొత్తాన్ని చెల్లించకుండా అధికార బలంతో షాపును స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. ఇప్పటి వరకు ఆ షాప్‌కు సంబంధించి రూ.లక్షకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంది. వెంటనే నోటీసులు జారీ చేసి అద్దె డబ్బు వసూలు చేయాలని, లేనిపక్షంలో దివాకర్‌ ట్రావెల్స్‌ను సీజ్‌ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. పార్కు ఏర్పాటు పేరుతో మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో ఉంటున్న దుకాణాల యజమానుల నుంచి భారీగా రూ.లక్షల్లో వసూలు చేసి కొంత మాత్రమే మున్సిపాలిటీకి చెల్లించారని, మిగిలిన మొత్తాన్ని జేసి సోదరులు స్వాహా చేశారని మండిపడ్డారు. జేసీ సోదరులు మున్సిపాలిటీని అడ్డుపెట్టుకొని దోచుకున్నదంతా నయా పైసాతో సహా వసూలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 

స్వాహా చేసిన వారిపై ఫిర్యాదు 
షాపుల అద్దెల మొత్తాన్ని మున్సిపాలిటీకి చెల్లించకుండా స్వాహా చేసిన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి శీనా, క్యాషియర్‌ రాజేష్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దె డబ్బు స్వాహాలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో విచారణ జరపాలని కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top