నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీల్లో(ట్రిపుల్‌ఐటీ) ప్రవేశాలకోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను సోమవారం వెల్లడించే అవకాశం ఉంది.
హైదరాబాద్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీల్లో(ట్రిపుల్‌ఐటీ) ప్రవేశాలకోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను సోమవారం వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు వీలుకాకపోతే రెండు మూడు రోజులు ఆలస్యం కానుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి లక్ష మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో విద్యార్థులు సాధించిన మార్కులను సీబీఎస్‌ఈ గతనెల 26నే ప్రకటించింది.
ఆలిండియా ర్యాంకులను ఈనెల 7న ప్రకటిస్తామని పేర్కొంది. ర్యాంకుల నిర్ధారణలో ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. వాటిని పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ఖరారు చేస్తారు. అయితే ఇంటర్‌లో వచ్చిన మార్కులను విద్యార్థులు ఆన్‌లైన్‌లో నిర్ధారించేందుకు గతనెల 27 వరకు ఇచ్చిన గడువును తొలుత 30వ తేదీ వరకు, ఆ తర్వాత ఈనెల 3 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆలిండియా ర్యాంకులను వెల్లడిస్తుందా లేదా అనే విషయం ఇంకా తేలలేదు.