టెన్షన్‌.. టెన్షన్‌

JC Diwakar Reddy Trying to Conflicts in Municipal Office - Sakshi

ఘర్షణలు సృష్టించాలనుకున్న ప్రతిపక్షం

ముందస్తు సమాచారంతో భారీగా పోలీసు బలగాల మోహరింపు

కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ జేసీ

అడ్డుకుని వెనక్కు పంపిన పోలీసులు.. బెడిసి కొట్టిన టీడీపీ వ్యూహం

ఉద్రిక్తతల నడుమ ముగిసిన మున్సిపల్‌ నామినేషన్ల ప్రక్రియ  

తాడిపత్రి: తాడిపత్రిలో మున్సిపల్‌ నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ఉద్రిక్తతల నడుమ ముగిసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల వారు నామినేషన్లు వేయడానికి పెద్ద సంఖ్య రావడంతో మున్సిపల్‌ కార్యాయంలో గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నామినేషన్ల పక్రియ మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అయితే మూడు గంటలకు ముందు కార్యాలయంలోకి ప్రవేశించిన అభ్యర్థులకు నామినేషన్లు వేసేందుకు ఎన్నికల అ«ధికారులు అనుమతించారు. ఇదిలా ఉండగా మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీకి చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డిలను డీఎస్పీ శ్రీనివాసులు, రాఘవరెడ్డిలు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు నిలువరించి వెనక్కు పంపించారు. 

ప్రతిపక్ష నేతల ఎత్తు చిత్తు..
మున్సిపల్‌ కార్యాలయంలోకి దూసుకెళ్లి ఘర్షణలు సృష్టించి.. ఆ నెపాన్ని అధికార వైఎస్సార్‌సీపీపైకి నెట్టాలని ప్రతిపక్ష టీడీపీ వేసిన ఎత్తును పోలీసులు చిత్తు చేశారు. ఈ వ్యూహాన్ని పసిగట్టిన పోలీసులు ముందస్తుగా కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇందులో భాగంగా సీబీ రోడ్డు నుంచి మున్సిపల్‌ కార్యాలయం వెళ్లే రహదారిలో భారీ బందోబస్తు నిర్వహించారు. లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు. అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే నామినేషన్లు వేసేందుకు అనుమతించారు. వైఎస్సార్‌సీపీ తరఫున 21వ వార్డుకు రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డి నామినేషన్‌ వేసేందుకు ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కలిసి మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. వీరితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు వేసేందుకు తరలివచ్చారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు పూర్తిగా సహరించడంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

క్యాంపు రాజకీయలు తెరలేపిన జేసీ
టీడీపీ తరపున నామినేషన్లు వేసిన కౌన్సిలర్‌ అభ్యర్థులను జేసీ సోదరులు శుక్రవారం రాత్రి క్యాంపుల(శిబిరాల)కు తరలించినట్లు తెలిసింది. అభ్యర్థులు తమకు తెలియకుండా ఎక్కడ నామినేషన్లను ఉపసంహరించుకుంటారోనన్న భయంతో వారిని ప్రత్యేక వాహనంలో రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. దీంతో అభ్యర్థుల కుటుంబీకుల్లో ఆందోళన మొదలైంది. అభ్యర్థులను ఎక్కడకు తీసుకెళ్లేదీ రహస్యంగా ఉంచడంతో వారి కుటుంబ సభ్యుల్లో మరింత టెన్షన్‌ పెంచుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top