జేసీ బ్రదర్స్‌ కాళ్లబేరం!

JC Brothers Ffrauds In Vehicle Registration - Sakshi

కేసులు పెట్టొద్దు బాబూ

తుక్కు లారీలు కొన్న వారిని వేడుకుంటున్న వైనం 

ఒక్కో లారీకి రూ.14 లక్షల మేర తిరిగి చెల్లింపులు 

కేసులు పెట్టబోమని బాండు పేపరు మీద సంతకాల సేకరణ 

జైలు భయంతో వణికిపోతున్న సోదర ద్వయం

అధికారంలో ఉన్నన్నాళ్లూ మా అంతటోళ్లులేరని విర్రవీగిన జేసీ సోదరులు.. ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నారు. వారు చేసిన ఒక్కో అక్రమం వెలుగుచూస్తుండగా జైలు భయంతో అన్నదమ్ములిద్దరూ ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలోనే బీఎస్‌–3 వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బీఎస్‌–4 వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించిన జేసీ సోదరులు.. వాటిని ఇతరులకు అంటగట్టి భారీగా వెనకేసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యవహారం వెలుగుచూడగా.. బాధితులు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో జేసీ సోదరులు కాళ్లబేరానికి దిగుతుండటం గమనార్హం. 

తుక్కులారీల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో జేసీ సోదరులు కాళ్ల బేరానికి దిగినట్టు తెలుస్తోంది. కేసులు పెట్టవద్దంటూ తమ నుంచి లారీలు కొన్న వారిని వేడుకుంటున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా తాము విక్రయించిన తుక్కు లారీలను వెనక్కి తీసుకుని సదరు యజమానులకు లారీకి రూ.14 లక్షల చొప్పున ముట్టచెబుతున్నారు. అంతేకాకుండా తమ మీద కేసులు పెట్టకుండా రూ.100 బాండ్‌ పేపరు మీద వారితో సంతకాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.  చదవండి: తిమ్మిని బమ్మిని 'జేసీ'.. 

మొత్తం 154 వాహనాలు 
బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌–4 వాహనాలుగా తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించి విక్రయించిన ఘటనలో రోజుకో అక్రమ వ్యవహారం వెలుగుచూస్తోంది. కేవలం నాగాలాండ్‌లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో కూడా ఈ దందా సాగించినట్లు సమాచారం. మొత్తంగా 154 బీఎస్‌–3 లారీలను    బీఎస్‌–4గా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొన్ని లారీలను రవాణాశాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా.. మిగిలిన లారీల కోసం వెతుకుతున్నారు. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, చండీఘర్‌ రాష్ట్రాల రవాణాశాఖ ఉన్నతాధికారులకు కూడా లేఖలు రాశారు. సదరు బీఎస్‌–3 తుక్కు లారీలు కనపడితే వెంటనే సీజ్‌ చేయాలని లేఖలో కోరినట్టు తెలుస్తోంది.  

నాలుగు రాష్ట్రాల్లో కొనుగోలు 
వాతావరణంలో కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు అనుగుణంగా బీఎస్‌–3 వాహనాల రిజిస్ట్రేషన్లను 2017 ఏప్రిల్‌ 1 నుంచి చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో బీఎస్‌–3 వాహనాలను విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బీఎస్‌–3 వాహనాలను.. బీఎస్‌–4 వాహనాలుగా పేర్కొంటూ నాగాలాండ్‌లోని జేసీ ట్రావెల్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 68 లారీలను స్క్రాప్‌ కింద తక్కువ ధరకు దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. అనంతరం ఇదే విధంగా తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా కాలం వాహనాలు కొనుగోలు చేశారు. మొత్తంగా 154 వాహనాలను తక్కువ ధరకే కొనుగోలు చేసి బీఎస్‌–4గా పేర్కొంటూ నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ తర్వాత వీటిని అనంతపురం రవాణాశాఖ కార్యాలయం ద్వారా ఎన్‌ఓసీ తీసుకుని దర్జాగా జిల్లాలో తిప్పారు.  జేసీ.. మీదీ బతుకేనా?

తుక్కులారీ రూ.20 లక్షలకు విక్రయం 
తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌లల్లో కూడా బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌–4గా మార్చి నకిలీ డాక్యుమెంట్లతో వాహనాలను తిప్పారు. ఇందులో కొన్ని లారీలను పలువురికి రూ.20 లక్షల చొప్పున విక్రయించారు. వాస్తవానికి ఆ లారీలకు మార్కెట్‌లో రూ.24 లక్షల నుంచి రూ.26 లక్షల మేర ఉండటంతో తమకు తక్కువ ధరకే వస్తుందన్న భావనతో పలువురు వీరి నుంచి లారీలను కొనుగోలు చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో రాష్ట్ర రవాణాశాఖ అధికారులు విచారణ ప్రారంభించి.. మొత్తం వ్యవహారాన్ని బయటకు లాగారు. అంతేకాకుండా ఈ వాహనాలను సీజ్‌ చేయడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో తమను మోసగించి తుక్కులారీలను విక్రయించారంటూ పలువురు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారిని జేసీ బ్రదర్స్‌ బతిమలాడుతూ కేసు పెట్టవద్దని వేడుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా లారీకి రూ.14 లక్షల చొప్పున వెనక్కు చెల్లించడంతో పాటు.. కేసులు పెట్టబోమని వారి నుంచి రూ.100 బాండు పేపరు మీద సంతకాలు తీసుకుంటున్నారు. తద్వారా తమపై నేరుగా కేసు నమోదు కాకుండా జేసీ సోదరులు తిప్పలు పడుతున్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో బలమైన ఆధారాలు ఉండటంతో కేసుల నుంచి తప్పించుకోవడం అంత సులువుకాదని రవాణాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.   జేసీ సోదరులు.. తోడుదొంగలు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top