కొమరాడ మండలంలోని జంఝావతి సైట్ ఇరిగేషన్ కార్యాలయ ఉద్యోగుల గుండెల్లో ‘బీరువా రైళ్లు’ పరుగులిడుతున్నాయి. సీలు వేసిన
పార్వతీపురం: కొమరాడ మండలంలోని జంఝావతి సైట్ ఇరిగేషన్ కార్యాలయ ఉద్యోగుల గుండెల్లో ‘బీరువా రైళ్లు’ పరుగులిడుతున్నాయి. సీలు వేసిన బీరువా తెరిచిందెవరో తెలీదని, దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని ఈఈ ఎం.భాస్కరరావు చెబుతుండగా, ఓ వ్యక్తి ఆ చెక్క బీరువా సీలు తీసి, ఓపెన్ చేస్తున్నట్లు జంఝావతి, పార్వతీపురం ప్రాంతంలో కొన్ని ఫొటోలు గత కొన్ని రోజులుగా కలకలం సృష్టిస్తున్నాయి. సీలు వేసిన బీరువా తెరవాలంటే పంచానామా చేసి, నిబంధనల ప్రకారం చేయూల్సి ఉండగా ఫొటోలలో కనిపిస్తున్న వ్యక్తి, ఉన్నతాధికారుల ఆదేశాలమేర కు బీరువా తెరిచాడా,..? లేక ఎవరూ లేనప్పుడు దొంగతనంగా తెరిచాడా...?అనే దానిపై ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు తేల్చాల్సి ఉంది.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు...? కార్యాలయంతో సంబంధమేంటి...? బయట వ్యక్తా...? కార్యాలయం ఉద్యోగా...? బయట వ్యక్తి అయితే...కార్యాలయంలోని బీరువా సీలు ఎలా తీస్తాడనే ...పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియూల్సి ఉంది. ఆ బీరువాలో విలువైన ఫైళ్లు ఏవీ కానరావడం లేదంటున్న అధికారులు, ఆ బీరువాలో ఏ ఏ విలువైన ఫైళ్లు, సమాచారం ఉందనేదానిపై కూడా దృష్టి సారించాల్సి ఉంది. ఇదిలా ఉండగా డ్యామ్‌సైట్‌లో జరిగిన అక్రమాలు, అవకతవకలకు సంబంధించిన కీలక సమాచారం ఫైళ్లు ఆ బీరువాలో ఉండడంతో సంబంధిత ఉద్యోగులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఓ మ్యాన్ మజ్దూర్ చుట్టూ ఈ వ్యవహారం తీరుగుతున్నట్లు ఆయా ఉద్యోగులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఈ ఫైళ్లు మా యం, సీలువేసిన బీరువా తాళం తెరవడానికి సంబంధించి స్థానిక గంగరేగువలస గ్రామానికి చెందిన గంటా పరాంకుశంనాయుడు, దాసరి చంద్ర, డి.హరినాయుడు తదితరులు సమాచార హక్కు చట్టంలో భాగంగా వీటికి సంబంధించి సమాచారాన్ని సంబంధిత అధికారులరు ఏప్రిల్ 28న అడిగినట్లు సమాచారం. ప్రాజెక్టు పనులు లేకపోవడంతో కార్యాలయంలో ఖాళీగా ఉంటున్న ఉద్యోగులు ఒకరిపై ఒకరు అన్నట్లు రాజకీయాలు చేసుకుంటూ...కీలకమైన ఫైళ్లు మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.