అందాలకు నిలయమైన మన్యం అక్రమాలకు వేదిక అవుతోంది.
అందాలకు నిలయమైన మన్యం అక్రమాలకు వేదిక అవుతోంది. ఏటేటా పంట విస్తీర్ణం పెరగడంతో పాటు ఏజెన్సీ అంతటా గంజాయి వాసనలు గుప్పుమంటున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) దాటి ఇతర రాష్ట్రాలకు ఈ మత్తు గమ్మత్తుగా రవాణా అవుతోంది. ఎక్సైజ్, పోలీసు అధికారులు దాడులు జరుపుతున్నా..నెలకు రూ.వంద కోట్లు వంతున ఏటా రూ.వేలాది కోట్లు పైనే ఈ వ్యాపార లావాదేవీలు జరుగుతున్నట్టు అంచనా. ఖాకీలు దూరని కారడవుల్లో పెద్ద ఎత్తున గంజాయి పండిస్తున్నారు. ఏటా ఆగస్టు నెలాఖరు నుంచి గంజాయి కోతలు ముమ్మరంగా సాగుతాయి. అనంతరం ఆరబెట్టిన ఎండు గంజాయిని వివిధ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. ఎక్కువగా కర్నాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రలకు తరలిస్తున్నారు. ఏవోబీతో పాటు ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలవైపు ఎక్సైజ్, సివిల్ పోలీసులు కన్నెత్తి చూడడం లేదు. కూంబింగ్ బృందాలు తిరుగుతున్నా.. వాటి ధ్యాసంతా దళసభ్యులపైనే ఉంటోంది. దీనిని ఆసరాగా చేసుకుని తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల మీదుగా అక్రమంగా దీనిని తరలిస్తున్నారు.
ఏటా రూ. వేల కోట్ల టర్నోవర్
గంజాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ గిరాకీ. కిలో రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముడుపోతోంది. ముఖ్యంగా శీలావతి రకం కాసులు కురిపిస్తోంది. దీంతో సంప్రదాయ పద్ధతులను వీడి ఆధునిక విధానాల్లో దీని పెంచుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. ఎత్తయిన కొండలు, అడవుల్లో ఊటగెడ్డలు, పారుగెడ్డలు నుంచి రెండు మూడు కిలోమీటర్ల వరకు చిన్నసైజు పైపులు ఏర్పాటు చేసి దీని సాగుకు అవసరమైన నీటిని మళ్లించడం గమనార్హం.