వీడని ఉత్కంఠ

Investigation Continued SIT officers in Thanelanka - Sakshi

ఠాణేల్లంకలో కొనసాగుతున్న సిట్‌ అధికారుల విచారణ

తూర్పుగోదావరి, ముమ్మిడివరం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనిపెల్ల శ్రీనివాసరావు స్వగ్రామం ఠాణేల్లంకలో ఉత్కంఠ వీడలేదు. శ్రీనివాసరావు మీడియా ముందుకు వచ్చి తనకు ప్రాణహాని ఉందని,  తనను చంపి రాజకీయాలు చేయాలనుకుంటున్నారనడంతో గ్రామంలో ఉద్విగ్న వాతవరణం నెలకొంది. అతని ఆరోగ్యం విషమించడంతో మంగళవారం అతనిని ఆసుపత్రికి తరలించారు. దాంతో ఠాణేల్లంకలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈకేసులో ఆరు రోజులుగా పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నప్పటికీ వాస్తవాలు వెలికి రాకపోగా హఠాత్తుగా శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో ఎవరైనా మట్టు బెట్టాలని ప్రయత్నిస్తున్నారా? లేక పోలీసుల చిత్ర హింసలతో శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించిందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా గ్రామంలో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) అధికారులు శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. అతని స్నేహితులను, కాల్‌ డేటా ఆధారంగా కొంతమంది యువకులను  విచారించారు. నిందితుడి ఇంటివద్ద, గ్రామంలో, పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు 26 మందిని సిట్‌ అధికారులు విచారించారు. శ్రీనివాసరావు తండ్రి తాతారావు అమలాపురంలోని ఫైవ్‌ స్టార్‌ కార్పొరేషన్‌ బ్యాంకు నుంచిమంగళవారం రూ.4 లక్షలు ఇంటి రుణం తీసుకున్నారు. ఈరుణం తాలుకూ నగదు శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఆ మేరకు ఆబ్యాంకు మేనేజర్‌ ఎం.బాస్కరరావు, ఏజెంట్‌ జీఎన్‌ బాబులను సిట్‌ అధికారులు ముమ్మిడివరం పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి విచారించారు.

సీబీఐ విచారణ చేయాలి
వ్యవసాయ కూలి కొడుకు.. అనామకుడైన యువకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం చేయడం ఆషామాషీ విషయం కాదు. ఇందులో ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. లేకుంటే నేరచరిత్ర కల్గిన శ్రీనివాసరావుకు పోలీసు వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌ (పీవీసీ) ఎవరు ఇస్తారు. స్థానిక  ఎస్సై తమకు తెలియదంటే ఇందులో తప్పనిసరిగా ప్రభుత్వ ప్రమేయం ఉంది. కేసును సిట్‌ అధికారులు నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయి.– కోన వెంకట శ్రీనివాసరావు, న్యాయవాది, ముమ్మిడివరం

వాస్తవాలు కప్పి పుచ్చేందుకు ప్రయత్నాలు
ఈకేసులో వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. నేర చరిత్ర కల్గిన శ్రీనివాసరావుపై ముమ్మిడివరంలో పలు కేసులున్నాయి. అయినప్పటికీ విమానాశ్రయంలో ఉద్యోగం సంపాదించాడంటే అతని వెనుక పెద్ద మనుషులున్నట్టు తెలుస్తోంది. సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి.  శ్రీనివాసరావు బయటకు వస్తే పెద్దల బండారం బయట పడుతుందని భయపడి అతనిని మట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.– రాయపురెడ్డి జానకిరామయ్య, మాజీ సర్పంచ్, చింతలపూడి పాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top