ప్రధాని వచ్చినా సెక్యూరిటీ ఒక్కరే

ప్రధాని వచ్చినా సెక్యూరిటీ ఒక్కరే - Sakshi


‘ఈ నాటక రచయిత ఏ ప్రయోగం చేసినా బాగానే ఉంటుంది, గొప్ప చిత్రకారుడు కూడా కావడం వల్ల దృశ్యాన్ని దర్శనీయంగా చిత్రించే నేర్పు ఉంది. రచన కూడా గొప్పగా ఉంది’ స్వయంగా మహాకవి శ్రీశ్రీతో ఇలాంటి కితాబులందుకున్న ఆ ప్రతిభావంతుడు డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ. నటుడు, రచయిత, దర్శకుడు, రూపశిల్పి... ఒకటేమిటి.. చిత్రలేఖన, సాహితీ, రంగస్థలం వంటి విభిన్న రంగాల్లో ఉత్కృష్ట స్థాయికి చేరిన బహుముఖీన ప్రజ్ఞాశీలి  డాక్టర్ గోపాలకృష్ణ. ఏయూ నాటక శాఖలో విభాగాధిపతిగా చేసి రిటైరైన ఆయన తాను పుట్టి పెరిగిన విశాఖ గురించి ఆనాటి జ్ఞాపకాలను సిటీప్లస్‌తో పంచుకున్నారు.

 

 

చిన్నంవారి వీధిలో పుట్టాను

నేను పుట్టింది విశాఖపట్నం చిన్నంవారి వీధి. నా చిన్నప్పుడే అక్కడి నుంచి వచ్చేశాం. అది నాకు పెద్దగా గుర్తు లేదు. ఆ తర్వాత కొల్లూరు జగన్నాథరావు గారు నన్ను అక్కడికి తీసుకెళ్లి ‘నువ్వు ఇక్కడే పుట్టావు’ అని చూపించారు. మా ఇంటి పక్కనే పింగళి లక్ష్మీకాంతం , రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి ఇళ్లు. అలా ఆ వీధంతా పెద్ద వాళ్ల ఇళ్లు ఉండేవి.

 

జట్కా ఒక్కటే

 నా చిన్నప్పటికి ఏయూ ఇంకా నిర్మాణంలో ఉంది. వాల్తేరులో ఇళ్లు ఏవీ ఉండేవి కాదు. మొత్తం నిర్మానుష్యంగా ఉండేది. రవాణా సౌకర్యాలు ఏవీ ఉండేవి కాదు. జట్కా బండి ఒక్కటే మార్గం. దానికి కూడా కొంత దూరం నడిస్తే కాని ఉండేది కాదు. గవర్నర్స్ బంగ్లా దగ్గర బాగా ఎత్తుగా ఉండేది. జట్కా అది ఎక్కగలిచేది కాదు. కాబట్టి అందరూ అక్కడ దిగి జట్కాను తోసి మళ్లీ ఎక్కేవారు. జట్కా వాడు ఎంతమంది ఎక్కినా కొంచెం ముందుకు జరగండి అంటూ ఎక్కువమందిని ఎక్కించే వాడు. దానితో వెనుక వైపు బరువు ఎక్కువైపోయి బండి వెనక్కు గాల్లోకి లేచిపోయేది. అందరం ఒకేసారి కింద పడిపోయేవాళ్లం. నాకు తెలిసిన తర్వాత ఇక్కడే మూడే బస్సులు ఉండేవి. ఒకటి ఉదయం పెదవాల్తేరు జంక్షన్ వరకు వచ్చి వెళ్లిపోయేది. తర్వాత మధ్యాహ్నం ఒకటి , సాయంత్రం ఒకటి వచ్చేవి.

 

 ఒకే ఒక్క పోలీస్


 ఇప్పటి రోజుల్లో ఓ మంత్రి వచ్చారంటే బోలెడంతా సెక్యూరిటీ హడావిడి. మనకు స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ప్రధాని లాంటి నాయకులు పాల్గొనే కార్యక్రమాలు చాలా సింపుల్‌గా ఉండేవి. 1948లో విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో నిర్మించిన తొలి నౌక ‘జలఉష’ సముద్ర ప్రవేశ ప్రొగ్రామ్‌కు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విశాఖపట్నం వచ్చారు. అప్పటి ఏయూ వీసీ సీఆర్ రెడ్డి ఏయూకు రమ్మని ఆహ్వానించారు. అక్కడ ఒక  మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి పాల్గొన్నారు. ఇంత పెద్ద ప్రొగ్రామ్‌కు కూడా కేవలం ఒకే ఒక్క కానిస్టేబుల్ లాఠీ పట్టుకుని డ్యూటీ చేశాడు.

 

బ్రిటిష్ ఆర్మీ ఇన్ బీచ్ రోడ్

 మా నాన్నగారి ఉద్యోగ రీత్యా మేము కొన్నాళ్లు తెనాలిలో ఉన్నాం. తర్వాత 1946లో ఇక్కడకు వచ్చేశాం. ప్రతి ఐదేళ్లకు విశాఖ అభివృద్ధి చెందుతూనే ఉంది. మేమిక్కడకు వచ్చాక చినవాల్తేరులో ఉండేవాళ్లం. అక్కడి నుంచి బీచ్‌కు వె ళ్తే బ్రిటిష్ ఆర్మీవాళ్లు చేసే మార్చ్ ఫాస్ట్‌లతో బీచ్ అంతా కిటకిటలాడిపోయేది. చాలా రేర్‌గా నీగ్రోలు కనిపించేవారు. వాళ్లను చూస్తేనే మాకు భయం వేసేది. బీచ్ రోడ్‌లో అంతా యూరోపియన్ భోజనం మాత్రమే దొరికేది. ఇండియన్ భోజనం కావాలి అంటే ఇంట్లో వండుకుని తినాల్సిందే. కూరలు కూడా ఎక్కువగా దొరికేవి కాదు.

 

 బియ్యం ఇచ్చేవారు. ఒకవారం అయితే అస్సలు బియ్యం కూడా లేవు. బంగాళదుంపలను పొడుగ్గా కట్ చేసి ఇచ్చేవారు. అవి ఎంత వండినా కూడా గుజ్జులా వచ్చేది తప్ప తినడానికి వీలుగా ఉండేవి కాదు. పాలు కూడా ఇంటికి వచ్చి పితికి ఇచ్చేవారు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ల ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్ అయినా, చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినా మిగిలిన వారికి పాలు ఉండేవి కాదు. మొత్తం వాళ్లే కొనుక్కునేవారు.

 

 టూత్ బ్రష్ తెలియదు

 ఆ రోజుల్లో మాకు టూత్ బ్రష్ అంటే ఏమిటో తెలియదు.ఎక్కడో యూరోపియన్లు మాత్రమే బ్రష్‌లు వాడేవారు. మిగిలిన వారు అందరూ పందుం పుల్లలతో పళ్లు తోముకునేవారు. అణాకు కట్ట అని అమ్ముతూ ఉండేవారు. దానికోసం ఊర్లో ఉన్న మా చిన్న పిల్లలం అందరం ఒక 20 మంది కలిసి పెద్ద గ్రూపుగా తయారయ్యేవాళ్లం. పెద్ద డబ్బాలు ఉండేవి. వాటికి తాడు కట్టి ఒక డప్పులా తయారుచేసి వాయిస్తూ ఇప్పుడు ఉషోదయ జంక్షన్ దగ్గరకు వచ్చేవాళ్లం.

 

 అప్పట్లో అది కాకులు దూరని కారడవి , చీమలు దూరని చిట్టడవి. అక్కడికి వచ్చి వేప చెట్లు నరికి పుల్లలు కట్టకట్టి తీసుకెళ్లేవాళ్లం. రేగు పళ్లు , తాటి ముంజులు , సీతాఫలాలు ఇలా చాలా రకాల పళ్లు ఎన్ని కావాలంటే అన్ని ఉండేవి.

 

 బీచ్ మొత్తం మారిపోయింది

 నా చిన్నప్పుడు బీచ్ చాలా అందంగా ఉండేది. ఆ బీచ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు యూనివర్శిటీ క్వార్టర్స్ ఉన్న ప్రాంతం ఎదురుగా బీచ్ ఉండేది. అక్కడ రెండు ఫుట్ బాల్ ఫీల్డ్స్ పక్క పక్కన పెడితే ఎంత ప్లేస్ ఉంటుందో అంత ఖాళీ ఉండేది. అక్కడ పొలిటికల్ మీటింగులు జరుగుతూ ఉండేవి. దాదాపు 30 వేల మంది అక్కడ కూర్చుని వినేవారు. సముద్రానికి దూరంగా కాబట్టి అలల శబ్దం కూడా వినిపించేది కాదు. అక్కడ మొత్తం ఫారిన్ కల్చర్ ఉండేది. అక్కడికి వెళ్లి రంగురంగుల గవ్వలు ఏరుకునేవాళ్లం. ఇప్పుడు ఆ గవ్వలు లేవు....సముద్రం కూడా చాలా ముందుకు వచ్చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top