ప్లాస్టిక్ నిషేధంపై తాత్సారం | Increasing plastic pollution in Tirupati | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ నిషేధంపై తాత్సారం

Jan 18 2014 5:42 AM | Updated on Mar 22 2019 7:19 PM

ఆధ్యాత్మిక నగరంగా పేరు పొందిన తిరుపతిలో పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ వాడకం యథేచ్ఛగా సాగుతోంది.

తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఆధ్యాత్మిక నగరంగా పేరు పొందిన  తిరుపతిలో పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ వాడకం యథేచ్ఛగా సాగుతోంది. రోడ్లపక్కనే ఎక్కడ పడితే అక్కడ వాడిపడేసిన ప్లాస్టిక్ కవర్లు దర్శనమిస్తున్నాయి.

 ప్లాస్టిక్‌తో ఇవీ ప్రమాదాలు..
 ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాలు తీసుకోవడం వలన అందులో ‘టాక్సిన్’ అనే విషపదార్థం కలుస్తుంది. దీంతో స్త్రీలలో రొమ్ము కేన్సర్, పిల్లల్లో బుద్ధిమాంద్యం, జ్ఞాపక శక్తి తగ్గడం, యువకులలో ఆరోగ్యం క్షీణించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ప్లాస్టిక్ కవర్లను వాడి పడేస్తే 100 సంవత్సరాలైనా భూమిలో కరిగిపోవు.

 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నవి రీసైక్లింగ్‌కు అనువుగా ఉండకపోవడంతో పర్యావరణానికి ప్ర మాదకరంగా మారుతున్నాయి. తిరుపతికి యాత్రికులు, శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరిలో చాలామంది టిఫిన్‌కోసం హోటళ్లు, టిఫిన్ బండ్లు, పానీపూరి బండ్లను ఆశ్రయిస్తుంటారు.  వీరికి ప్లాస్టిక్ కవర్లు, ప్యాకెట్లలో ఆహార పదార్థాలను విక్రయిస్తుం డటంతో వాటిని తిని రోగాల బారిన పడుతున్నారు.

 ప్రభుత్వం ఆదేశించినా..
 పర్యావరణానికి ముప్పుగా మారిన 40 మైక్రాన్ల మందం కంటే తక్కువగా ఉ న్న ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అప్పటి తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ జానకి  ఆపై కమిషనర్‌గా బాధ్యత లు స్వీకరించిన ప్రసాద్ క్షేత్రస్థాయిలో కదలిక తీసుకొచ్చి నగరంలో ఏకధాటిగా ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలపై దాడు లు చేసి, జరిమానాలు విధించారు.

రాజకీయ నాయకుల ఒత్తిడి పెరగడం తో ఆయన మిన్నకుండిపోయారు. అనంతరం కమిషనర్‌గా వచ్చిన మురళీ ప్లాస్టిక్ నిషేధం ఊసే ఎత్తలేదు. ప్రస్తుతం కమిషనర్‌గా పనిచేస్తున్న సకలారెడ్డి బాధ్యతలు తీసుకున్న మొదట్లో ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం మోపుతామని, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పది రోజుల క్రితం మార్కెట్‌లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిం చడం మినహా, నిషేధానికి ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

 విక్రయాలపై చర్యలు శూన్యం
 కార్పొరేషన్ పరిధిలో సుమారు రెండు వేలకు పైగా దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటిలో ప్లాస్టిక్ కవర్ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. 50కి పైగా హోల్‌సేల్ దుకాణాలలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. చెన్నై, బెంగళూరు నుంచి 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులు భారీగా తెప్పించుకుంటు న్నారు.

 వీటిని నగరంలోని ఇసుకవీధి, నెహ్రూవీధి, కొర్లగుంట, ఇందిరా ప్రియదర్శిని మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నాయకుల అండ ఉండటంతో కార్పొరేషన్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఒక వేళ దాడులు చేసి నిషేధిత ప్లాస్టిక్ కవర్లను టన్నుల కొద్దీ పట్టుకున్నా కేవలం నామమాత్రపు జరిమానా వేసి వదిలేస్తున్నారు.

 ప్రత్యామ్నాయాన్ని పట్టించుకోవడం లేదు
 ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జూట్‌బ్యాగులను, గుడ్డ సంచులను వా డేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుడ్డ సంచులను తయారు చేసేందుకు స్వయంశక్తి మహిళా సంఘాలు ముందుకొస్తున్నా వారిని ప్రోత్సహించడం లేదని తెలిసింది. ఇకనైనా తిరుపతిలో పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement