అసోసియేషన్ ముసుగులో వ్యాపారం | In pursuit of the Association of Business | Sakshi
Sakshi News home page

అసోసియేషన్ ముసుగులో వ్యాపారం

Feb 17 2014 3:17 AM | Updated on Oct 20 2018 6:17 PM

నిబంధనలు అమలు చేయాల్సిన ఉద్యోగులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. అసోసియేషన్ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాల్సిన భవనాన్ని దుకాణాల నిర్వహణకు బాడుగలకిచ్చి దండుకుంటున్నారు.

నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: నిబంధనలు అమలు చేయాల్సిన ఉద్యోగులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. అసోసియేషన్ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాల్సిన భవనాన్ని దుకాణాల నిర్వహణకు బాడుగలకిచ్చి దండుకుంటున్నారు. ఎక్కడైనా అనుమతి లేకుండా చిన్న నిర్మాణం చేపట్టినా కూల్చివేసే అధికారులే అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టరేట్‌కు సమీపంలోనే ఈ నిర్మాణాలు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 నెల్లూరులోని బారకాసు సెంటర్‌లో 1976లో ప్రభుత్వం ఓ భవనం నిర్మించింది. ఈ భవనాన్ని మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు అప్పట్లోనే అప్పగించారు. కొన్నాళ్ల పాటు దీనిని ఉద్యోగులు తమ అసోసియేషన్ కార్యకలాపాలకే వినియోగించారు. అనంతరం వ్యాపార దృక్పథంతో ఆలోచించి భవనంపై 1981లో మరో అంతస్తు నిర్మించారు. ఆ భవనం ఆవరణలోనే ఏడాది క్రితం 15 దుకాణాలతో కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. దీని నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోలేదని సమాచారం. అసోసియేషన్ కార్యాలయంపైనా మరో ఆరు దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి అడ్వాన్సుల రూపంలో ఇప్పటికే లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు, నెలకు మరో రూ.2 లక్షలు అద్దెల రూపంలో వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
 ఈ మొత్తం అంతా అసోసియేషన్ సభ్యులే పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం దుకాణాలకు అద్దెకు ఇస్తే, వాటికి సంబంధించిన పన్నును కార్పొరేషన్‌కు చెల్లించాలి. ఈ దుకాణాల విషయంలో ఆ నిబంధనలు అమలుకు నోచుకోలేదని తెలుస్తోంది. ఈ వ్యవ హారం మొత్తాన్ని సభ్యులందరికీ తెలియకుండా కొందరు కార్యవర్గ సభ్యులు నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
 
 ఎన్జీఓలకు మరో న్యాయం
 నగరంలోని దర్గామిట్టలో ఎన్జీఓ కార్యాలయం ఉంది. ఈ భవనాన్ని పలు కార్యక్రమాలకు బాడుగలకు ఇస్తుంటారు. అయితే ఈ భవనానికి సంబంధించి పన్ను కట్టలేదంటూ ఇటీవల కార్పొరేషన్ అధికారులు కుళాయి కనెక్షన్ తొలగించారు. ఇక్కడ నిబంధనల ప్రకారం నడుచుకున్న కార్పొరేషన్ అధికారులు తమ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో మరోలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 చర్యలు తీసుకుంటాం..
 జాన్‌శ్యాంసన్, కమిషనర్, నెల్లూరు నగరపాలక సంస్థ
 నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌కు సంబంధించిన అనుమతులు, పన్నుల చెల్లింపు విషయం తెలియదు. దీనిపై పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement