రూ.660 కోట్లతో తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల అభివృద్ధి | Improvement of Tirupati and Nellore Railway Stations with Rs 660 crores | Sakshi
Sakshi News home page

రూ.660 కోట్లతో తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల అభివృద్ధి

May 17 2020 4:53 AM | Updated on May 17 2020 4:53 AM

Improvement of Tirupati and Nellore Railway Stations with Rs 660 crores - Sakshi

సాక్షి, అమరావతి:  రైల్వే స్టేషన్ల రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో తిరుపతి, నెల్లూరు స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. రూ.660 కోట్లను వెచ్చించి మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ హబ్‌లుగా ఈ రెండు స్టేషన్లను తీర్చి దిద్దనున్నారు. ఇందుకోసం రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) టెండర్లు ఆహ్వానించింది. ముందుగా నిర్మాణ సంస్థలకు అవగాహన కల్పించేందుకు ఆన్‌లైన్‌లో ప్రీ బిడ్‌ సమావేశాలు నిర్వహించగా జీఎంఆర్, ఒబెరాయ్, ఆంబియెన్స్, అదానీ గ్రూప్, గోద్రేజ్‌ ప్రాపర్టీస్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, శోభా, బ్రిగేడ్, ఎంబసీ గ్రూప్‌ తదితర నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. జూన్‌ రెండో వారంలో టెండర్లను ఆర్‌ఎల్‌డీఏ ఖరారు చేయనుంది. టెండర్లు ఖరారైన తర్వాత మూడేళ్లలోపు రీ డెవలప్‌మెంట్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసి నిర్వహణకు 60 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో షాపింగ్, సినిమా హాళ్లు, హాస్పిటాలిటీ, ఫుడ్‌ కోర్టులు, క్లోక్‌ రూంలు, వసతి గృహాలు, ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లు వంటివి ప్రపంచ స్థాయిలో నిర్మాణం చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకు వస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను రూ.530 కోట్లతో, నెల్లూరు స్టేషన్‌ను రూ.130 కోట్లతో రీ డెవలప్‌మెంట్‌ చేయనున్నారు.  

పీపీపీ విధానంలో అభివృద్ధి 
► డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ) విధానంలో పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద అభివృద్ధి చేస్తారు.   
► కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసి 60 ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. 
► తిరుపతి, నెల్లూరులలో ఉన్న రైల్వే భూములు వాణిజ్య అభివృద్ధికి, డెవలపర్‌ ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ఉపయోగపడతాయి. 
► ఈ సందర్భంగా ఆర్‌ఎల్‌డీఏ వైస్‌ చైర్మన్‌ వేద ప్రకాష్‌ దుడేజా మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల రీ డెవలప్‌మెంట్‌ ఆ ప్రాంతాల వాణిజ్య అభివృద్ధికి, పర్యాటక సామర్థ్యం, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడుతుంది అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement