రెండు కళ్ల సిద్ధాంతం పాటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు దమ్ముంటే సొంత నియోజకవర్గంలో దీక్ష చేపట్టాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు, తాజామాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు
మంత్రాలయం, న్యూస్‌లైన్: రెండు కళ్ల సిద్ధాంతం పాటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు దమ్ముంటే సొంత నియోజకవర్గంలో దీక్ష చేపట్టాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు, తాజామాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు. మంత్రాలయంలో ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమకారుల భయంతోనే డిల్లీలో దీక్ష బూనారన్నారు. ఇక్కడ దీక్ష చేపడితే జనాలు తరిమికొడతారన్న భయంతోనే డిల్లీకి వెళ్తున్నారన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు 68 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. రాష్ట్రం రావణకాష్టంగా మారినా.. కాంగ్రెస్ పాలకులకు కనికరం లేకపోయిందన్నారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు కేవలం పదవుల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు నమ్మకంతో అధికారం ఇస్తే వారి ఆశలను అడియాసలు చేయడం దారుణమన్నారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు దద్దమ్మలని ప్రజలు దుయ్యబడుతున్నా చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాలు రెండురోజులతో తుడిచిపెట్టుకుపోతాయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అనడంతో విజయనగరం ప్రజలు తిరగబడ్డారన్నారు.
ఆస్తులు ధ్వంసం కావడానికి వారి నోటి దురుసు కారణమని తెలిపారు. ఎంపీ హర్షకుమార్ తనయులు ఉద్యమకారులపై దాడి చేయడం దారుణమన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుపోవాల్సింది పోయి ఇలా రౌడీల్లా వ్యవహరించడం విచారకరమన్నారు. కలిసి ఉండగానే తెలంగాణ నాయకులు రాజోలి బండ నుంచి అక్రమంగా నీటి వాటాను తరలిస్తున్నా..అడిగేనాథుడు లేడన్నారు. ఇక విడిపోతే రాయలసీమ రైతుల పరిస్థితి అగమ్యగోచరమేనన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేయకపోతే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందన్నారు. ఆందోళనలో సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు వెంకటేష్‌శెట్టి, నాయకులు ప్రభాకర్ ఆచారి, వెంకటరెడ్డి, అశోక్‌రెడ్డి, మల్లి, గోరుకల్లు కృష్ణస్వామి, భాస్కర్, హనుమంతు, వడ్డె ఈరన్న పాల్గొన్నారు.