ఆదిలాబాద్ జిల్లాకు మొదటి పోస్టింగ్‌లో ఎస్పీగా నియామకం కావడం అదృష్టమని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తానని డాక్టర్ గజరావు భూపాల్ అన్నారు.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాకు మొదటి పోస్టింగ్‌లో ఎస్పీగా నియామకం కావడం అదృష్టమని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తానని డాక్టర్ గజరావు భూపాల్ అన్నారు. సుమారు రెండేళ్లపాటు జిల్లా ఎస్పీగా పనిచేసిన సర్వశ్రేష్ట త్రిపాఠి ఈ నెల 27 సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీగా(పరిపాలన) పనిచేస్తూ పదోన్నతిపై ఆదిలాబాద్ ఎస్పీగా నియమితులైన గజరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందని భూపాల్‌ను ప్రభుత్వం జిల్లా ఎస్పీగా నియమించింది. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఎస్పీ భూపాల్ విలేకరులతో మాట్లాడారు.
నక్సల్స్ కట్టడి..
మత ఘర్షణలు లేకుండా చూస్తాం..
ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుశాఖ ప్రథమ కర్తవ్యమని, అయితే నక్సల్స్ కార్యకలాపాల కట్టడి, మత ఘర్షణలకు తావు లేకుండా ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎస్పీ గజరావు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహారాష్ర్ట-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లా గనక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు చేపడుతామన్నారు. సమస్యలు ఉంటే తనను నేరుగా సంప్రదింవచ్చని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి రశీ దులు ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశిస్తామని ఎస్పీ భూపాల్ పేర్కొన్నారు. జిల్లాపై పూర్తిగా అవగాహన తెచ్చుకుని ప్రజల మనోభావాలకు అనుగుణంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు.
కలెక్టర్ , జిల్లా న్యాయమూర్తులను కలిసిన ఎస్పీ
బుధవారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ భూపాల్ కలెక్టర్ అహ్మద్ బాబు, జిల్లా న్యాయమూర్తి జి.గోపాల కృష్ణమూర్తిలను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలవగా పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి గోపాల కృష్ణమూర్తిని కూడా ఎస్పీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీ జిల్లా జడ్జిని కలిసిన సమయంలో ఆయనతోపాటు జిల్లా అదనపు న్యాయమూర్తులు కె.సునీత, ఎన్.రాజ్‌కుమార్‌లు ఉండగా, జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలిపారు.
ఎస్పీ భూపాల్‌కు అభినందనలు తెలిపిన అధికారులు
జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గజరావు భూపాల్‌ను ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఓఎస్‌డీ పనసారెడ్డి, అదనపు ఎస్పీలు అప్పారావు (పరిపాలన), ఎన్‌వీ కిషన్‌రావు, బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ వోరం భాస్కర్‌రావు, ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్ డీఎస్పీలు లతామాధురి, ఎం.రవీందర్‌రెడ్డి, వి.శేషుకుమార్, దేవదాసు నాగుల, బి.సురేష్‌బాబులతో ఎస్‌బీఐ కె.సీతారాములు, ఆదిలాబాద్ పట్టణ సీఐలు గణపతి జాదవ్, నారాయణ, ఉదయ్‌కిరణ్‌లతోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు, ఏఆర్‌ఐలు ఎస్పీని కలిశారు. కాగా పోలీ సు అధికారుల సంఘం ఆధ్వర్యంలో పోలీసులు, సిబ్బంది ఎస్పీని కలిశారు.