 
															తినడానికి లేకపోతే పోలీసులే అన్నం పెట్టారు:విజయరాణి
తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న తనకు పోలీసులే అన్నం పెట్టారని టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి మీడియా ముందు వాపోయింది.
	హైదరాబాద్:తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న తనకు పోలీసులే అన్నం పెట్టారని టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి మీడియా ముందు వాపోయింది.  ప్రస్తుతం తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని తెలిపింది.  బెంగళూరులో పట్టుబడిన ఆమెను సీసీఎస్ పోలీసులు శుక్రవారం విచారించారు. పోలీస్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గగ్గోలు పెట్టుకుంది. తాను రూ. 10 కోట్లకు పైగా చిట్టీలతో మోసం చేయలేదని,  కేవలం తాను జూనియర్ ఆర్టిస్టులకు మాత్రమే రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది.
	
	 
	అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని, అప్పులపాలు కావడంతో పారిపోయానని, తన వద్ద చిల్లిగవ్వలేదని విజయరాణి విచారణలో తెలిపింది. కోట్లాది రూపాయలు దోచుకుందని ఒకవైపు బాధితులు చెప్తుంటే... మరోవైపు ఆమె తన వద్ద ఒక్కపైసాకూడా లేదని చెప్పడంతో ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. విజయరాణిని విచారించిన సీసీఎస్ పోలీసులు .. ఆమె టీవీ ఆర్టిస్టుల వద్ద చిట్టీల పేరుతో రెండు కోట్లను వసూలు చేసిందని తెలిపారు. ఇప్పటికే ఆమె పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్తులతో వచ్చిన డబ్బులను బాధితులకు అందజేస్తామన్నారు.
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
