మనసు చెప్పినట్లే విన్నా: వైఎస్ జగన్

మనసు చెప్పినట్లే విన్నా: వైఎస్ జగన్ - Sakshi


ఇడుపులపాయ : తనపై నమ్మకం ఉంచి  శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆయన బుధవారం ఇడుపులపాయలో మాట్లాడుతూ ఆనాడు విలువల కోసం తాను, అమ్మ విజయమ్మ మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చామన్నారు. కొండను ఢీకొని నాశనమైపోతామని అందరూ అన్నారని, అధికార పార్టీపై పోరాటం కష్టమని వ్యాఖ్యలు చేశారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.



రాజకీయం ఉన్నా, లేకున్నా మనిషి మనిషిగా బతకాలని తన మనసు చెప్పిందని వైఎస్ జగన్ అన్నారు. ఆరోజు మెదడు చెప్పిన మాట కన్నా... మనసు చెప్పిన మాటనే విన్నానని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి ఉన్నానని జగన్ స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేశామని, కుట్రలు, కుతంత్రాలను చూశామన్నారు. సీబీఐ అనే ఆయుధాన్ని వాడి, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నారు.



16 నెలలు జైల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేశారని జగన్ అన్నారు. అయితే ఏ ఒక్క శాసనసభ్యుడు తనను విడిచి వెళ్లలేదని ఆయన తెలిపారు. 20మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు అలానే పార్టీ వెంట ఉన్నారన్నారు. రాజకీయ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా నాలుగేళ్లు పోరాడమని, అందుకే అధికారంలోకి వస్తామనే విశ్వాసం కలిగిందన్నారు.



అనేక అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాటాలు చేయగలిగిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గడిచిన నాలుగేళ్లలో బాధితులకు అండగా నిలబడింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు. గెలుపుకి..ఓటమికి తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే అని జగన్ వ్యాఖ్యానించారు. ఇవాళ 9మంది ఎంపీలు, 67మంది ఎమ్మెల్యేలను దేవుడు ఇచ్చారని, భగవంతుడు మనకేమీ తక్కువ చేయలేదన్నారు.



చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తున్నప్పుడు ....తనను కూడా అలాంటి హామీలు ఇవ్వమని చాలామంది చెప్పారని, అయితే తాను అలా చేయలేదన్నారు. రాజకీయాల్లో తాను నమ్మిన సిద్ధాంతం విశ్వసనీయత, విలువలు అని అన్నారు. వాటికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. మనిషిలో విశ్వసనీయత, విలువలు లేకపోతే కట్టుకున్న భార్యకు కూడా సమాధానం చెప్పుకోలేమన్నారు. చేయలేనిదాన్ని చేస్తానని తాను చెప్పలేనని జగన్ అన్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top