గర్భిణి అని కూడా చూడలేదు

Husband Harassment Complaint In Nellore - Sakshi

గూడూరు (నెల్లూరు): ఆ యువతికి తల్లిదండ్రులు లేరు. తోబుట్టువే చందాలు సేకరించి ఆరేళ్ల క్రితం ఆటోడ్రైవర్‌కిచ్చి వివాహం  చేసింది. పెళ్లై ఐదేళ్లు గడిచినా గర్భంరాని నీకు ఇప్పుడెలా వచ్చిందంటూ నిండు గర్భిణిని కొట్టి గెంటివేసిన ఘటన గూడూరు పట్టణంలోని పూలతోట గిరిజన కాలనీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఎస్‌కే ఖాదర్‌బాషా, అనూబేగంలకు కుమార్తెలు షబ్బీరా, దిల్‌షాద్‌లతోపాటు మరో కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు గత కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. ఈ మేరకు పెద్ద కుమార్తె షబ్బీరా బంధువులు, స్నేహితుల సాయంతో ఆరేళ్ల క్రితం దిల్‌షాద్‌కు వివాహం జరిపించింది.

ఈ క్రమంలో దిల్‌షాద్‌కు ఐదేళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో భర్త రఫీతోపాటు అత్తమామలైన నూర్జహాన్, మస్తాన్‌బాషాల వేధింపులు పెరిగాయి. ఈ క్రమంలో దిల్‌షాద్‌ ఆరునెలల క్రితం గర్భం దాల్చింది. కొన్ని నెలలపాటు అత్తమామలు, భర్త ఇన్నేళ్లు రాని గర్భం ఇప్పుడెలా వచ్చిందంటూ శారీరకంగా హింసించారు. బాధలు పడుతూ వచ్చిన ఆమెను 23వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో కొట్టి ఇంట్లోంచి గెంటేశారు. ఈ మేరకు అదే సమయంలో దిల్‌షాద్‌ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసే క్రమంలో సృహకోల్పోయి శివాలయం సమీపంలో పడిపోయింది. అదే సమయంలో బీట్‌ పోలీసులు గుర్తించి దిల్‌షాద్‌ను స్థానిక ఏరియా ఆస్పత్రి తరలించారు. పరీక్షలు చేయగా తల్లీబిడ్డ క్షేమమని తెలిసింది. అయితే హాస్పిటల్‌లో బెడ్‌లు ఖాళీగా లేక పోవడంతో హాస్పిటల్‌ బయటే నిరీక్షించాల్సి వచ్చిందని షబ్బీరా ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరికి న్యాయం చేయాలంటూ ఆమె పోలీసుల చుట్టూ తిరుగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top