చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పటిష్ట బందోబస్తు | High security for chandra babu meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పటిష్ట బందోబస్తు

May 29 2014 11:47 PM | Updated on Aug 24 2018 2:33 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు నిర్వహించాలని రేంజ్ ఐజీ పి.వి.సునిల్‌కుమార్ అధికారులను ఆదేశించారు.

ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి  చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు నిర్వహించాలని రేంజ్ ఐజీ పి.వి.సునిల్‌కుమార్ అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 8న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే ఏఎన్‌యూ ఎదుట, పరిసర ప్రాంతాలను కార్యక్రమం పూర్తయ్యే వరకు పోలీసుల నిఘాలో ఉంచాలని ఆదేశించారు. జాతీయ రహదారి పక్కనే కార్యక్రమం జరుగనున్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, సెక్యూరిటీ పరంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వీఐపీల భద్రత విషయంలో రాజీలేకుండా బలగాలను మోహరించాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాలను ముందుగానే గుర్తించి పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేకంగా ఇద్దరు ఎస్పీలను కేటాయించాలని ఆదేశించారు. రెండు హెలీప్యాడ్‌లవద్ద సమస్యలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
 
 కార్యక్రమానికి ఇద్దరు డీఐజీలు, ఆరుగురు ఎస్పీలు, ఆరువేల మంది పోలీసు బలగాలు, ఆరు కంపెనీల కేంద్ర బలగాలను కేటాయిస్తున్నామన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు ఆరు లక్షల మంది వచ్చినా సమస్యలు తలెత్తకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు.  సమావేశంలో రూరల్‌జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ, అర్బన్‌జిల్లా అదనపు ఎస్పీలు డి.కోటేశ్వరరావు, జానకి ధరావత్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, మధుసూదన్‌రావు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement