766 రోజులు ఏం చేశారు? | High Court Slams AP Govt Over Pulichintala Contract Payments | Sakshi
Sakshi News home page

Nov 30 2018 3:43 AM | Updated on Jul 12 2019 6:06 PM

High Court Slams AP Govt Over Pulichintala Contract Payments - Sakshi

సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ కాంట్రాక్టర్‌కు రూ.410 కోట్ల పరిహారం చెల్లింపు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మచిలీపట్నం కోర్టు తీర్పుపై 766 రోజుల తర్వాత న్యాయపోరాటానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసింది.. మచిలీపట్నం కోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన పరిహారంలో 50 శాతాన్ని ఆరు వారాల్లో డిపాజిట్‌ చేస్తేనే.. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తామని ఈనెల 23న హైకోర్టు షరతు విధించింది.. కాంట్రాక్టర్‌ బొల్లినేని శీనయ్యకు సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులతో అవినాభావ సంబంధం ఉండటం వల్లే మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్‌ చేయడానికి అనుమతి ఇవ్వకుండా మోకాలడ్డుతూ వచ్చారని అధికారవర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెళితే.. పులిచింతల ప్రాజెక్టుకు 2004 ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు రూ.565.89 కోట్లతో అప్పటి చంద్రబాబు సర్కార్‌ పరిపాలన అనుమతి ఇచ్చింది. రూ.268.89 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌(జలాశయం) పనులను తనకు అత్యంత సన్నిహితుడైన బొల్లినేని శీనయ్యకు చెందిన ఎస్‌సీఎల్‌–సీఆర్‌18జీ(జేవీ)కి చంద్రబాబు అప్పగించారు. రాష్ట్రంలో జలవనరుల శాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బిల్లుల విషయంలో ఏదైనా వివాదం ఉత్పన్నమైతే.. డీఏబీ(వివాద పరిష్కార మండలి)ని ఆశ్రయించవచ్చనే నిబంధనను కాంట్రాక్టు ఒప్పందంలో చేర్చారు. 2004లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పనులను పరుగులు పెట్టించారు. డీఏబీని అడ్డుపెట్టుకుని చీటికిమాటికీ అదనపు బిల్లుల కోసం కాంట్రాక్టర్‌ పేచీ పెడుతోండటంతో.. జలవనరుల శాఖ పనుల్లో డీఏబీని రద్దు చేశారు. 2009 నాటికే ప్రాజెక్టు పూర్తయింది. 
హైకోర్టును ఆశ్రయించకుండా మోకాలడ్డు..

మచిలీపట్నం కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జూన్‌ 2, 2016 నుంచి అక్టోబర్‌ 1, 2018 వరకూ అనేక మార్లు జలవనరుల శాఖ అధికారులు సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలకు ప్రతిపాదనలు పంపారు. అయితే ఏం తేల్చకుండా నాన్చుతూ వచ్చారు. సర్కార్‌ తీరును అలుసుగా తీసుకున్న కాంట్రాక్టర్‌ తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని.. తనకు చెల్లించాల్సిన సొమ్మును జలవనరుల శాఖ ఆస్తులు విక్రయించి, చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మళ్లీ మచిలీపట్నం కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారించిన కోర్టు ప్రభుత్వ ఆస్తులను అటాచ్‌ చేస్తూ జూలై 31, 2017న తీర్పు ఇచ్చింది. ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చే సొమ్ముతో పులిచింతల కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పు అమలు చేస్తే.. అసలు రూ.199.96 కోట్లు, అక్టోబర్‌ 3, 3013 నుంచి 15 శాతం వడ్డీ రూపంలో రూ.210.04 వెరసి రూ.410 కోట్లను కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. 

అక్టోబర్‌ 3న కేబినెట్‌లో చర్చించిన ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు రూ.410 కోట్లను చెల్లించడానికి  సిద్ధమైంది. అయితే జలవనరులు, ఆర్థిక శాఖ అధికారుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో ఎట్టకేలకు న్యాయపోరాటానికి అనుమతి ఇచ్చింది. ఆ మేరకు అక్టోబర్‌ 31న పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ అడ్వకేట్‌ జనరల్‌కు ప్రతిపాదన పంపి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఈనెల 23న హైకోర్టు విచారణకు స్వీకరించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేయకుండా 766 రోజలుపాటూ జాప్యం చేసినందుకుగానూ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతాన్ని డిపాజిట్‌ చేస్తేనే వ్యాజ్యాన్ని విచారిస్తామని తేల్చిచెప్పడం గమనార్హం. ప్రభుత్వం ఆదిలోనే స్పందించి హైకోర్టులో సవాల్‌ చేసి.. సాధికారికంగా వాదనలు వినిపించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని జలవనరుల శాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

అస్మదీయునిపై వల్లమాలిన ప్రేమ..
వైఎస్‌ మరణించిన తర్వాత అదనపు బిల్లుల కోసం కాంట్రాక్టర్‌ మళ్లీ పేచీ పెట్టారు. అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని 2012లో కాంట్రాక్టర్‌ కోరారు. దీన్ని మొదట డీఏబీ సభ్యులు, తర్వాత నిపుణుల కమిటీ పరిశీలించి గరిష్ఠంగా రూ.72 కోట్లను చెల్లించడానికి అంగీకరించింది. 
తన ప్రభుత్వాన్ని రక్షించిన చంద్రబాబు సూచనల మేరకు.. 

పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు నిధులు ఇవ్వాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒత్తిడి చేయడంతో ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ మచిలీపట్నం కోర్టులో సవాల్‌ చేశారు. మచిలీపట్నం కోర్టులో కాంట్రాక్టర్‌ లేవనెత్తిన 27 అంశాలను తిప్పికొట్టేలా సమర్థవంతంగా వాదనలు విన్పించకుండా ఉన్నత స్థాయి నుంచి తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా కోర్టు జూన్‌ 2, 2016న కాంట్రాక్టర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం రూ.199.96 కోట్లను అక్టోబర్‌ 3, 2013 నుంచి 15 శాతం వడ్డీతో కాంట్రాక్టర్‌కు చెల్లించాలి. 

పులిచింతల కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన పరిహారంలో 50 శాతాన్ని డిపాజిట్‌ చేస్తేనే కేసు విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు చెప్పిందంటూ రాష్ట్ర జలవనరులుశాఖ కార్యదర్శికి ఈ నెల 23న అడ్వకేట్‌ జనరల్‌ రాసిన లేఖలోని భాగం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement