లాల్‌బహదూర్ స్టేడియంలో ఈనెల 19న బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, చట్ట ప్రకారం నిర్ణయం వెలువరించాలని సెంట్రల్ జోన్ డీసీపీని హైకోర్టు ఆదేశించింది.
సెంట్రల్ జోన్ డీసీపీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: లాల్‌బహదూర్ స్టేడియంలో ఈనెల 19న బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, చట్ట ప్రకారం నిర్ణయం వెలువరించాలని సెంట్రల్ జోన్ డీసీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 12 లోపు నిర్ణయాన్ని పిటిషనర్‌కు తెలియచేయాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ బహిరంగ సభకు అనుమతిచ్చే విషయంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, సభ నిర్వహణకు వెంటనే అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ నూతి రామ్మోహనరావు విచారిం చారు. పిటిషనర్ తరఫున చిత్తరవు నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. 19వ తేదీన సభ నిర్వహణకు అనుమతినివ్వాలని కోరుతూ సెంట్రల్‌జోన్ డీసీపీకి ఈ నెల 3న దరఖాస్తు చేసుకున్నామని, ఇప్పటివరకు దానిపై నిర్ణయం వెలువరించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమకెలాంటి అభ్యంతరం లేదని, అయితే సభ నిర్వహణకు పోలీసు అనుమతి తప్పనిసరని చెప్పామని శాప్ తరఫు న్యాయవాది నివేదించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా తమ దరఖ్తాసుపై నిర్ణయం వెలువరించకుండా జాప్యం చేస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఎప్పటిలోగా పిటిషనర్ దరఖాస్తుపై నిర్ణయం వెలువరిస్తారని హోంశాఖ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. పోలీసులతో మాట్లాడి పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతానని హోంశాఖ న్యాయవాది చెప్పగా, కేసు విచారణను రేపటికి వాయిదా వేసి, తగిన ఉత్తర్వులు జారీ చేయాలని నాగేశ్వరరావు కోరారు. అవసరం లేదన్న న్యాయమూర్తి.. పిటిషనర్ దరఖాస్తుపై 12లోపు చట్ట ప్రకారం నిర్ణయం వెలువరించాలని డీసీపీని ఆదేశించారు. ఆ నిర్ణయాన్ని పిటిషనర్‌కు తెలియచేయాలంటూ.. ఈ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.