 
															ప్రతీకాత్మక చిత్రం
కర్నూలు(అగ్రికల్చర్): ఏటా పెరుగుతున్న ఎండల తీవ్రతకు కష్టజీవులు వడదెబ్బకు గురై అశువులు బాస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఒక్క మృతుడి కుటుంబానికి కూడా చేయూతనివ్వలేదు. 2014–17మధ్య కాలంలో 192 మంది వడదెబ్బతో మృతి చెందారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఒక్కరికి కూడా పరిహారం మంజూరు కాకపోవడంతో కుటుంబ పెద్ద మృతితో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నా పాలకుల్లో కనికరం లోపించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
 
పరిహారం నిల్.. 
సాధారణంగా వడదెబ్బ మరణాలను మండల తహసీల్దార్, ఎస్‌ఐ, మెడికల్ ఆఫీసర్‌లతో కూడిన బృందం ధృవీకరిస్తుంది. వీటికి ప్రత్యేకంగా పోస్టుమార్టం లేకపోయినప్పటికీ ముగ్గురు సభ్యులున్న మండలస్థాయి బృందం ధృవీకరించాలి. వడదెబ్బ మరణాలని ఈ కమిటీ నిర్ధారించిన్పటికీ ప్రభుత్వం నుంచి చేయూత దక్కకపోవడం గమానార్హం. రాష్ట్రం మొత్తం మీద 2014 నుంచి వడదెబ్బతో 2776 మంది మరణించగా జిల్లాలో 192 మంది మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మృతుల్లో ఒక్కరికి కూడా పరిహారం చెల్లించలేదు.  
గతంలో.. 
వడదెబ్బ మృతులు,  ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు గతంలో ఆపద్బందు పథకం కింద రూ.50వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఇచ్చేది. టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో పేదలు మరణిస్తే ఆ కుటుంబాలకు చేయూత అందకుండా పోతోంది.  చలివేంద్రాలు, చలువ పందిళ్లు, మజ్జిగ పంపిణీలో నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లాలో రూ.కోటి ఖర్చు పెడితే ఇందులో రూ.50 లక్షల వరకు దుర్వినియోగం జరిగినట్లు విమర్శలున్నాయి. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన చలివేంద్రాలను సైతం ప్రభుత్వ ఖాతాలో వేశారనే ఆరోపణలున్నాయి.   
2017లో మరణాల సంఖ్య తగ్గింపు.. 
2014 నుంచి 2016 వరకు జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2017లో ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత పెరిగి వడదెబ్బ మరణాలు పెరిగాయి. వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు దాదాపు 100 మంది వరకు వడదెబ్బతో మృతి చెందారు. అయితే మరణాల సంఖ్యను తగ్గించాలని  ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు సంఖ్యను తక్కువగా చూపారు. 2016లో 65 మంది మరణించినట్లు లెక్కలు ఉన్నా.. 2017లో కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని అధికారుల లెక్కలు పేర్కొంటున్నాయి. ఉద్దేశ్య పూర్వకంగానే మరణాల సంఖ్యను  తగ్గించినట్లు తెలుస్తోంది.  
చలివేంద్రాల పేరుతో నిధులు వృథా.. 
చలివేంద్రాలు, చలువ పందిళ్లు, మజ్జిగ పంపిణీ పేరుతో జిల్లాలో ఏటా రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రాణాలు కోల్పోయిన పేద కుటుంబాలకు మాత్రం పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  
 2014 నుంచి 
వడదెబ్బ మరణాలు ఇలా... 
సంవత్సరం    మృతుల సంఖ్య 
       2014         43 
      2015          76 
      2016          65 
      2017            8 
   మొత్తం          192   

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
