ప్రజాపోరాటాలకు అండగా ఉంటాం


సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ప్రజాపోరాటాలకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ చెప్పారు. ప్రజల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు, త్యాగాలు చేసేందుకైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.



రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలనే లక్ష్యంతో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబర్ రెండో తేదీ నుంచి సమన్యాయయాత్రకు శ్రీకారం చుడతారని రఘురాం చెప్పారు.  సమైక్యవాదులకు సంఘీభావం తెలిపేందుకు షర్మిల ఈ యాత్ర చేపడుతున్నారని తెలిపారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున యాత్రను మొదలుపెట్టి 13 జిల్లాల్లో విస్తృత్తంగా పర్యటిస్తారని పేర్కొన్నారు. శాంతియుత పంథాలో ప్రజాపోరాటాన్ని సాగించేలా, రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేలా షర్మిల యాత్ర కొనసాగుతుందని వివరించారు.

 

కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదు..



 అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సాగిస్తున్న నీచ రాజకీయాలకు కోట్లాదిమంది తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రఘురాం ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారకాంక్షతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేస్తోందని, రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి సహించలేని కాంగ్రెస్.. ఆ పార్టీని రాజకీయంగా అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.



పోలీసు యంత్రాంగం కూడా అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ   వైఎస్సార్  సీపీ శ్రేణులను ఇబ్బందులు పెడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలందరికీ సమన్యాయం జరగాలనే లక్ష్యంతో తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేసిన  ఆమరణదీక్షను సైతం పోలీసులు అక్రమంగా భగ్నం చేశారని మండిపడ్డారు. అదే సమయంలో.. అదే ప్రాంతంలో టీడీపీ నేతల  దీక్షను భగ్నంచేసిన పోలీసులు  వారిని ప్రత్యేకంగా  అంబులెన్స్‌లో తరలించి ప్రత్యేక గదిలో చికిత్స చేశారని చెప్పారు.



వైఎస్ విజయమ్మను మాత్రం పోలీసు వ్యాన్‌లో తరలించి, ఆస్పత్రిలోని సాధారణ వార్డులో చికిత్స నిర్వహించడం సమంజసమా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీని అధికార పార్టీ టార్గెట్ చేసిందని, అయినప్పటికి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏమాత్రం భయపడకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ క్యాడర్‌ను నడిపిస్తున్నారని స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు చేయని వైఎస్ జగన్‌ను 15 నెలలకు పైబడి జైలులో ఉంచారని, అయినా ఆయన ప్రజల ప్రయోజనాలకోసం జైలు నుంచే పోరాటాలకు సిద్ధపడి ఆమరణ దీక్ష చేస్తున్నారని వివరించారు.

 

బాబూ నోరువిప్పవేం?




 రాష్ట్రం రావణకాష్టంలా మారినా చంద్రబాబు నోరువిప్పడం లేదని రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయంపై ప్రతిపక్ష నేత హోదాలో ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో మిలాఖత్ అయిన చంద్రబాబు నోరువిప్పితే తనపై కేసులు పెడతారనే భయంతోనే మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో ఇన్నిన్ని ఆందోళనలు, ఉద్యమాలు సాగుతుంటే చంద్రబాబు మాత్రం ఏమీపట్టనట్టు వ్యవహరిస్తూ జాతీయ వ్యవహారాలపై మాట్లాడడం సిగ్గుచేటని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top