గుండెనొప్పి వస్తే గుంటూరుకే! | Guntur in the heart of the pain! | Sakshi
Sakshi News home page

గుండెనొప్పి వస్తే గుంటూరుకే!

Jun 30 2014 2:01 AM | Updated on Sep 15 2018 3:43 PM

గుండెనొప్పి వస్తే గుంటూరుకే! - Sakshi

గుండెనొప్పి వస్తే గుంటూరుకే!

అర్థరాత్రి నిండు గర్భిణీ ప్రసవ వేదనలో ఆస్పత్రికి వస్తే శిశువు ఎలా ఉందో స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. ఆ సమయంలో నొప్పులు పడుతూనే చిమ్మచీకటిలో కిరాయి

  •  పెద్దాస్పత్రిలో సౌకర్యాల లేమి
  •  అరకొర  వైద్యులు, సిబ్బంది
  •  మందుల కొనుగోలుకు నిధుల్లేవ్
  •  నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం
  • విజయవాడ : అర్థరాత్రి నిండు గర్భిణీ ప్రసవ వేదనలో ఆస్పత్రికి వస్తే శిశువు ఎలా ఉందో స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. ఆ సమయంలో నొప్పులు పడుతూనే చిమ్మచీకటిలో కిరాయి ఆటోలో ప్రవేటు స్కానింగ్ సెంటర్‌కు తరలివెళ్లాల్సి వచ్చింది.
     
    వారం రోజుల కిందట ఏబై ఏళ్ల వ్యక్తికి గాయాలు కావడంతో 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి తలకు బలమైన గాయం కావడంతో గుంటూరు తీసుకెళ్లాల్సిందిగా రిఫర్ చేశారు. అతన్ని  గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
     
    ఇలా నిత్యం పదుల సంఖ్యలో రోగులు నగరం నుంచి గుంటూరుకు తరలివెళ్తుడంగా, మరికొందరు అప్పుచేసైనా చికిత్స చేయించుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు.  గుండెనొప్పితో నిరుపేద ప్రభుత్వాస్పత్రికి వస్తే వైద్యం అందని దయనీయ స్థితి నెలకొంది. ఆ విభాగంలో వైద్యులు లేకపోవడంతో గుంటూరుకు రిఫర్ చేయడంతో అక్కడకు వళ్లేందుకు అంబులెన్స్‌కు సైతం డబ్బుల్లేక  ఎంతో మంది పేదలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రిఫరల్ ఆస్పత్రిగా ఉన్న పెద్దాస్పత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో  సౌకర్యాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు.
     
    జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి  రోగులు ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారు.  ఆస్పత్రిలో 790 పడకలు వున్నా, ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బంది,సౌకర్యాలు  లేక పోవడంతో వైద్యం అందని దుస్థితి నెలకొంది.   ఆస్పత్రిలో ఎక్స్‌రే మిషన్ పదిహేనురోజుల కిందట పాడైనప్పటికీ, దానిని మరమ్మతు చేసేందుకు నిధులు లేక చేతులెత్తేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ప్రమాదంలో చేయి విరిగి వచ్చిన వారికి కనీసం ఎక్స్‌రే  తీయలేని దుస్థితిలో ప్రభుత్వాస్పత్రి ఉంది.
     
     బర్న్స వార్డులో సౌకర్యాల లేమి...

    చికిత్స కోసం ఈ వార్డులో చేరిన రోగి, కాలిన గాయాల కన్నా వార్డులో ఉక్కపోతతోనే మృతి చెందడం తధ్యమని పలువురు వైద్య నిపుణులే అంటున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, నిబంధనల ప్రకారం ఏసీలు, ఒక్కోరోగికి నెట్‌లు అందించాల్సి ఉండగా, పడకలపై బెడ్‌షీట్లు సైతం వేయలేని దుస్థితి నెలకొన్నట్లు సిబ్బందే చెపుతున్నారు. కాగా 410 పడకల  ఆస్పత్రిగా ఉన్నప్పుడు 8 రేడియో గ్రాఫర్స్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 790 పడకలకు ఆస్పత్రి చేరుకున్నపటికీ రేడియో గ్రాఫర్ మాత్రం ఒక్కరే అందుబాటులో ఉండటం విశేషం.

    ఒక్క రేడియో గ్రాఫర్‌తో ఎలా ఎక్స్‌రేలు తీస్తారో ఉన్నతాధికారులకే తెలియాలని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్ల కిందట సీటీ స్కాన్ అందుబాటులోకి వచ్చినా, సీటీ టెక్నీషియన్ పోస్టులు నేటికీ అధికారికంగా కేటాయించలేదు. దీంతో టెంపరరీగా చేసే వారికి సైతం జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఆస్పత్రి అధికారులున్నారు. ఆరోగ్యశ్రీ నిధుల నుంచి కొంత మొత్తం చెల్లిస్తుండగా ఇద్దరు టెక్నిషియన్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో సీటీ స్కాన్ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఆరు నెలలుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో మందులు సైతం కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది.
     
     సమయపాలన పాటించని సిబ్బంది...
     అరకొర సౌకర్యాలతో పాటు, సిబ్బంది సైతం సమయ పాలన పాటించకపోవడం రోగులకు మరింత శాపంగా మారుతోంది.  మూడేళ్ల కిందట అప్పటి కలెక్టర్ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ప్రవేశ పెట్టాలని ఆదేశించినా, నేటికీ అమలుకు నోచుకోని దుస్థితి నెలకొంది.  ఈ విషయాలన్నింటిపై నేడు జరుగబోయే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అమాత్యులు దృష్టి సారిస్తారో లేదో వేచిచూడాల్సిందే.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement